ఆ నమ్మకాన్ని వమ్ము చేయను.. భయపడే ప్రసక్తేలేదు.. నిమ్మగడ్డ

శనివారం, 30 జనవరి 2021 (13:03 IST)
ఏపీ ఎన్నికల సంఘం ప్రధానాధికారి నిమ్మగడ్డ రమేశ్‌ కుమార్ శనివారం కడప జిల్లాలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా మీడియా సమావేశంలో నిమ్మగడ్డ రమేశ్‌ మాట్లాడుతూ.. పంచాయతీ ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించాలని అధికారులకు చెప్పారు. అసాధారణ ఏకగ్రీవాల ప్రక్రియ సరికాదని తెలిపారు. ఇటువంటి ప్రక్రియపై షాడో బృందాలు దృష్టి పెడతాయని చెప్పారు. 2006లో 36 శాతమే ఏకగ్రీవమయ్యాయని వివరించారు. 
 
అందరికీ సమాన న్యాయం కల్పించాలన్నదే లక్ష్యమనిు చెప్పారు. అలాగే, ఎన్నికలు సకాలంలో జరగాలని అన్నారు. తాను వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో ఆర్థిక శాఖ కార్యదర్శిగా పనిచేశానని, ఆయనలో లౌకిక దృక్పథం ఉండేదని చెప్పారు. తనపై ఆయన ఉంచిన నమ్మకాన్ని తాను వమ్ము చేయలేదని తెలిపారు. ఇటీవల జరిగిన పరిణామాల్లో తానే ప్రత్యక్షసాక్షినని కీలక వ్యాఖ్యలు చేశారు. ఏ పరిస్థితుల్లోనూ భయపడే ప్రసక్తేలేదని తాను స్పష్టం చేశానని అన్నారు. 
 
ఎట్టి పరిస్థితుల్లోనూ సరైన సమయంలో ఎన్నికలను నిర్వహించడమనేది రాజ్యాంగం కల్పించిన హక్కని పునరుద్ఘాటించారు. వ్యవస్థలను గౌరవించకుండా కొందరు మావాళ్లు, మీవాళ్లు అంటూ వ్యాఖ్యలు చేస్తున్నారని, ఆ తీరు సరికాదని చెప్పారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు