ఏపీ రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనరు నిమ్మగడ్డ రమేష్ కుమార్‌పై వైకాపా ఎంపీ విజయసాయి రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ విడుదలైన తర్వాత కూడా తనపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారంటూ వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డితో పాటు.. మంత్రులు పెద్దిరెడ్డి, బొత్సలపై గవర్నర్‌కు నిమ్మగడ్డ ఫిర్యాదు చేశారు.
ఈ వ్యవహారంలో నిమ్మగడ్డను విజయసాయి రెడ్డి టార్గెట్ చేశారు. ఇదే అంశంపై ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, టీడీపీ అధినేత చంద్రబాబుకు నిమ్మగడ్డ ఒక తొత్తు అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కులపిచ్చితో ఆయన ప్రవర్తిస్తున్నారన్నారు.
గరికపాటి, చాగంటి, ఉషశ్రీలకు మించి నీతులు, ధర్మాలు, నిజాయతీల గురించి నిమ్మగడ్డ మాట్లాడుతున్నారని విజయసాయి అన్నారు. నిమ్మగడ్డ రాష్ట్ర ఎన్నికల కమిషనరో లేక టీడీపీ ఎలక్షన్ కమిషనరో అర్థం కావడం లేదని విమర్శించారు.