నిర్మలా సీతారామన్ 'ఆవకాయ'.. వీడియో వైరల్

మంగళవారం, 5 సెప్టెంబరు 2017 (06:01 IST)
నిర్మలా సీతారామన్. పుట్టింది తమిళనాడు రాష్ట్రంలో. విద్యాభ్యాసం చేసిన ఢిల్లీలో. కోడలిగా అడుగుపెట్టింది ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో. గత 2006లో క్రియాశీలక రాజకీయాల్లోకి అడుగుపెట్టిన ఈమె... అంచలంచెలుగా ఎదిగారు. ఇపుడు పూర్తి స్థాయిలో దేశ రక్షణ మంత్రిగా బాధ్యతలు చేపట్టనున్నారు. అదీ కూడా ఉక్కు మనిషిగా పేరొందిన మాజీ ప్రధాని ఇందిరా గాంధీ తర్వాత రెండో మహిళగా రికార్డు సృష్టించారు.
 
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మంత్రివర్గంలో సహాయ మంత్రిగా ఉన్న నిర్మలా సీతారామన్.. ఇపుడు పదోన్నతి పొంది కేబినెట్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆ తర్వాత ఆమెకు రక్షణ మంత్రిత్వ శాఖను ప్రధాని కేటాయించారు. ఈ శాఖను కేటాయించిన తర్వాత ఆమెకు సంబంధించిన వీడియో ఒకటి యూట్యూబ్‌లో ప్రత్యక్షమైంది. గతంలో గృహిణిగా ఉన్న సమయంలో తమ ఇంటి వ్యవహారాల్లో.. ముఖ్యంగా పచ్చళ్లు పెట్టడం వంటి విషయాల్లో ఆమె ఆసక్తి కనబరిచేవారు.
 
ఈ విషయాన్ని తెలియజేస్తున్న వీడియో ఒకటి ఇప్పుడు వైరల్‌గా మారింది. సుమారు నాలుగేళ్ల కిందటి ఈ వీడియోలో.. నిర్మలా సీతారామన్, పరకాల ప్రభాకర్ అక్కతో కలిసి 2013 వేసవి కాలంలో ఆవకాయ పెడుతున్నారు. ఈ వీడియోను 2013 మే 16వ తేదీన యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేయగా ఇపుడు వైరల్‌గా మారింది. పైగా, ఈ వీడియోను పరకాల ప్రభాకర్ స్వయంగా యూట్యూబ్ చానెల్‌లో అప్‌లోడ్ చేయడం గమనార్హం. 
 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు