ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేపట్టిన కేంద్ర మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో భాగంగా అత్యంత కీలకమైన రక్షణశాఖను నిర్మలా సీతారామన్‌కు కేటాయించారు. కేబినెట్ మంత్రిగా ప్రమోషన్ పొందిన ఆమెకు.. ఇంతటి కీలకమైన శాఖ కేటాయించడం గమనార్హం. ఈమె ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి రాజ్యసభకు ప్రాతినిథ్యం వహిస్తున్నారు.
అయితే, మాజీ ప్రధాని దివగంత ఇందిరా గాంధీ తర్వాత రక్షణ శాఖ బాధ్యతలు చేపడుతున్న రెండో మహిళగా నిర్మలా సీతారామన్ చరిత్ర సృష్టించారు. గతంలో 1975, 1980 నుంచి 1982 వరకు రెండుసార్లు ఇందిరా గాంధీ భారత రక్షణ మంత్రిగా ఉన్నారు.
ప్రస్తుత గోవా ముఖ్యమంత్రి మనోహర్ పారీకర్ రక్షణ మంత్రిత్వ శాఖకు రాజీనామా చేయడంతో ఇప్పటివరకు రక్షణ శాఖ అదనపు బాధ్యతలను ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ చూస్తూ వచ్చారు. కేబినెట్ పునర్వ్యవస్థీకరణ తర్వాత కూడా ఆయనకే రక్షణశాఖ బాధ్యతలు అప్పగించినట్లు ముందు వార్తలు వచ్చాయి. అయితే, అనూహ్యంగా ఆ శాఖను నిర్మలకు కేటాయించారు.
ఇక రైల్వేమంత్రిగా రాజీనామా చేసిన సురేశ్ ప్రభుకు వాణిజ్య శాఖ, ధర్మేంద్ర ప్రధాన్‌కు కేబినెట్ మంత్రి హోదాలో పెట్రోలియం శాఖ బాధ్యతలు అప్పగించారు. నితిన్ గడ్కరీ - గంగా ప్రక్షాళన, జలవనరుల అదనపు బాధ్యతలు, నరేంద్ర సింగ్ తోమర్ - గనుల శాఖ, ముక్తార్ అబ్బాస్ నఖ్వీ -మైనార్టీ వ్యవహారాల శాఖ, ఉమా భారతి - తాగునీరు, పారిశుధ్య శాఖ, సంతోష్ కుమార్ గంగ్వార్ - స్వతంత్ర హోదాలో కార్మిక, ఉపాధి కల్పన శాఖ, గిరిరాజ్ సింగ్ - స్వతంత్ర హోదాలో సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమను కేటాయించారు.
కొత్త మంత్రులు అల్ఫోన్స్ కన్నన్ థామన్‌కు స్వతంత్ర హోదాలో పర్యాటకం, సమాచారం, సాంకేతిక, రాజ్ కుమార్ సింగ్‌కు స్వతంత్ర హోదాలో విద్యుత్ శాఖ, హర్దీప్ సింగ్ పూరీకి స్వతంత్ర హోదాలో పట్టణాభివృద్ధి, గృహ నిర్మాణ శాఖ, శివ ప్రతాప్ శుక్లా - ఆర్థిక సహాయ మంత్రి, అశ్వినీ కుమార్ చౌబే - ఆరోగ్య, కుటుంబ సంక్షేమ సహాయ మంత్రి, వీరేంద్ర కుమార్ - స్త్రీ, శిశు, మైనార్టీ సంక్షేమ సహాయ మంత్రి, అనంత కుమార్ హెగ్డే - నైపుణ్యాభివృద్ధి సహాయ మంత్రి, గజేంద్ర సింగ్ షెకావత్ - వ్యవసాయ రైతు సంక్షేమ సహాయమంత్రి గా బాధ్యతలు అప్పగించారు. ఇక ఒలింపిక్ మెడల్ విన్నర్ రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్‌కు క్రీడాశాఖ కేటాయించారు.