నివర్ తుఫాను.. హైదరాబాదులో వర్షాలు.. ఏపీకి మరో ముప్పు..

శనివారం, 28 నవంబరు 2020 (13:28 IST)
నివర్‌ తుపాను ప్రభావంతో హైదరాబాద్‌లో శుక్రవారం రాత్రి నుంచి వర్షం పడుతుంది. నగరంలోని పలు ప్రాంతాల్లో ఈదురు గాలులతో కూడిన వర్షం పడుతోంది. నగరంలో చలి పెరిగింది. తీరం దాటిన తుపాను బలహీనపడిందని వాతావరణ అధికారి రాజారావు తెలిపారు. బంగాళాఖాతం పశ్చిమ ప్రాంతంలో అల్పపీడనం ఉంది. దీనికి అనుబంధంగా 4.5 కిలోమీటర్ల ఎత్తు వరకూ గాలులతో ఉపరితల ఆవర్తనం ఉంది.
 
ఇకపోతే.. ఆంధ్రప్రదేశ్‌ను వర్షాలు ఇబ్బందులు పెడుతున్నాయి. నివర్ తుఫాన్ ధాటికి చిత్తూరు, నెల్లూరు, కడప జిల్లాలు అతలాకుతలం అయ్యాయి. నివర్ తుఫాన్ తరువాత ఇప్పుడు మరలా బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడింది. ఇది తీవ్ర వాయుగుండంగా మారి బురేవి తుఫాన్‌గా మారింది. నివర్ తుఫాన్ మాదిరిగానే ఇది కూడా తీవ్ర తుఫాన్ గా మారే అవకాశం ఉందని వాతావరణశాఖ అంచనావేస్తుంది. 
 
దక్షిణ తమిళనాడుతో పాటుగా ఆంధ్రప్రదేశ్ పై దీని ప్రభావం అధికంగా ఉండే అవకాశం ఉంది. దీంతో ఏపీ ప్రభుత్వం అప్రమత్తమైంది. ఇప్పటికే నివర్ తుఫాన్ కారణంగా ఏపీలో భారీ నష్టం సంభవించింది. ఈ నష్టం నుంచి బయటపడకముందే బురేవి ముప్పు పొంచిఉండటంతో అధికారులు అప్రమత్తం అయ్యారు. అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు. 
 
బురేవి తరువాత డిసెంబర్ 7 వ తేదీన టకేటీ తుఫాన్ నుంచి కూడా ముప్పు పొంచి ఉన్నట్టు వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. వరసగా బంగాళాఖాతంలో తుఫానులు ఏర్పడుతుండటంతో తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు అప్రమత్తం అయ్యాయి.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు