ఓటు కోసం న్యాయ పోరాటం చేయనున్న ఎస్ఈసీ నిమ్మగడ్డ!!?

శుక్రవారం, 29 జనవరి 2021 (11:12 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనరుగా నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఉన్నారు. ఈయన సారథ్యంలో త్వరలో పంచాయతీ ఎన్నికలు  జరుగనున్నాయి. విచిత్రమేమిటంటే.. ఈయనకు ఏపీలో ఓటు హక్కు లేదు. హైదరాబాద్‌లో ఉన్న ఓటు హక్కును తన సొంత గ్రామానికి బదిలీ చేయాలని దరఖాస్తు చేసుకున్నారు. కానీ అధికారుల అలసత్వం కారణంగా ఆయన పేరు ఓటర్ల జాబితాలోకి ఎక్కలేదు. దీంతో ఆయన ఓటు కోసం న్యాయపోరాటం చేయాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ అంశంపైనే ఇపుడు ఏపీలో ఆసక్తికర చర్చ నడుస్తోంది.
 
హైదరాబాద్‌లో ఉన్న తన ఓటును తీసివేసి స్వగ్రామం గుంటూరు జిల్లా దుగ్గిరాలలో ఇవ్వాలని దరఖాస్తు చేస్తే.. రెవెన్యూ అధికారులు తిరస్కరించారు. ఆయనే స్వయంగా ఈ విషయాన్ని వెల్లడించారు. సాక్షాత్తూ  ఎన్నికల కమిషర్‌కే ఓటు లేకుండా చేస్తే, ఇక సామాన్యుడి గతేమిటన్న ప్రశ్న తలెత్తుతోంది. ఇపుడు ఓటు హక్కు కోసం మళ్లీ ఆయన జిల్లా కలెక్టర్‌కు అప్పీల్‌ చేయగా అది పరిశీలనలో ఉంది. అక్కడా తిరస్కరిస్తే కోర్టుకు వెళ్తానని.. తన హక్కును దక్కించుకుంటానని ఆయన స్పష్టం చేశారు. 
 
ఆయన స్వగ్రామంలో మొదటి విడతలోనే ఎన్నికలు జరగనున్నాయి. స్థానికంగా నివాసం ఉండటం లేదని, అందువల్లే ఓటు ఇవ్వలేకపోతున్నామని వివరణ ఇస్తూ ఇటీవల రెవెన్యూ అధికారులు ఆయన ఇంటికి నోటీసు అంటించేందుకు వచ్చారు. అంత పెద్దాయన ఇంటికి నోటీసు అంటించటం బాగోదని.. తామే అందజేస్తామని పొరుగింటివారు తీసుకున్నారు. 
 
ఆయనకు సొంత నివాసం, పొలాలున్నా ఓటు హక్కు ఇవ్వకపోకవడం దారుణమని స్థానికులు అంటున్నారు. ఆయనకు ఓటు హక్కు కల్పించేందుకు తగు కారణాలున్నాయని, వాటిని విస్మరించి కావాలనే ఓటును 'ఆర్డినరీ రెసిడెన్సీ' అనే సాకుచూపి తిరస్కరించారని కొందరు నిపుణులు అంటున్నారు. సాధారణంగానే ఉద్యోగులకు 'టెంపరరీ మైగ్రేటెడ్‌' అనే క్లాజుతో ఓటు హక్కు కల్పిస్తారని.. కానీ తిరస్కరిస్తూ పోతే రాష్ట్రంలో పనిచేస్తున్న ఏ ఉద్యోగికీ ఓటు హక్కు ఉండదని చెబుతున్నారు.
 
ఒక ఉద్యోగి మరోచోట పనిచేస్తున్నప్పుడు బదిలీ అయిన ప్రతిసారీ ఓటును మార్చుకోరని.. ఎవరైనా స్వగ్రామంలోనే ఓటు వేసేందుకు ఇష్టపడతారని.. ఉగ్యోగులకు వీలుకాకున్నా, ఎన్నికల సంఘం పోస్టల్‌ బ్యాలెట్‌ ద్వారా ఓటును వినియోగించుకునే అవకాశం కల్పించిందని.. కేవలం రాజకీయ కారణాలతోనే నిమ్మగడ్డకు ఓటును తిరస్కరించి ఉంటారనే అభిప్రాయాన్ని విశ్రాంత రెవెన్యూ ఉన్నతాధికారులు వ్యక్తం చేస్తున్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు