లండన్‌లో నార్మన్ ఫోస్టర్ ఆర్కిటెక్ట్ కంపెనీ నవ్యాంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణానికి సంబంధించిన డిజైన్లను రూపొందించింది. వీటిని లండన్ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఆయన వెంట ఉన్న మంత్రులు, దర్శకుడు ఎస్ఎస్.రాజమౌళి పరిశీలించారు.
తన తొమ్మిది రోజుల విదేశీ పర్యటనలో భాగంగా దుబాయ్ నుంచి మంగళవారం లండన్ చేరుకున్న సీఎం చంద్రబాబు.. సినీ దర్శకుడు రాజమౌళితో కలసి ఫోస్టర్ బృందాన్ని కలుసుకున్నారు. రాత్రి బాగా పొద్దుపోయేవరకూ ప్రత్యేకంగా చర్చలు జరిపారు. రాజధాని నిర్మాణానికి సంబంధించి లండన్‌కు చెందిన నార్మన్ పోస్టర్ సంస్థ ఇప్పటివరకు ఐదారుసార్లు డిజైన్లు రూపొందించినా అవి సీఎంను ఆకట్టుకోలేకపోవడం తెలిసిందే.
ఈ డిజైన్లు భారతీయత ఉట్టిపడేలా, ప్రజల ఆత్మవిశ్వాసాన్ని ప్రతిబింభించేలా నవ్యాంధ్ర శాసనసభ, హైకోర్టు భవనాల ఆకారాలను తయారు చేశారు. ఒక్కో భవంతికి రెండు ఆకారాలను చంద్రబాబు, రాజమౌళి, యనమల తదితరులకు ఆ కంపెనీ ప్రతినిధులు చూపించారు.
నమూనా ఆకృతులను, ఆపై వీడియో చిత్రాలను వీరు తిలకించారు. ఈ భవంతుల ప్రత్యేకతలను వివరిస్తూ, నాలుగు కిలోమీటర్ల వరకూ ఇవి కనిపిస్తాయని క్రిస్ వెల్లడించారు.