జగన్మోహన్ రెడ్డి పాలనలో రాష్ట్రం ఆత్మహత్యాంధ్రప్రదేశ్ గా మారింది: పంచుమర్తి అనురాధ

శుక్రవారం, 20 నవంబరు 2020 (08:17 IST)
జగన్మోహన్ రెడ్డి పాలనలో రాష్ట్రం ఆత్మహత్యాంధ్రప్రదేశ్ గా మారిందని టీడీపీ నాయకురాలు పంచుమర్తి అనురాధ
ధ్వజమెత్తారు. ఆమె విలేఖరులతో మాట్లాడుతూ...
 
"చంద్రబాబు ఏపీని సన్ రైజ్ స్టేట్ గా తీర్చిదిద్దితే జగన్ రెడ్డి ఆత్మహత్యాంధ్రప్రదేశ్ గా మార్చారు. ఏ టూ జెడ్ అన్ని వ్యవస్థలను భష్టు పట్టించారు. ఏ ఫర్ అభివృద్ధి, బి ఫర్ భవన నిర్మాణ రంగం, సి ఫర్ క్యాస్ట్, డి ఫర్ దళితులు , ఇ ఫర్ ఎకానమీ సహా అన్నీ నిర్వీర్యమయ్యాయి.

అధికారంలోకి వచ్చిన ఏడాదిన్నరలో లక్ష కోట్లకు పైగా అప్పులు చేసిన ఘనత వైసీపీ ప్రభుత్వానికే దక్కింది. ఆశావర్కర్లు, అంగన్ వాడీలు, నరేగా ఫీల్డ్ అసిస్టెంట్లు ...వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. భవన నిర్మాణ కార్మికుడు వెంకటేష్ ఆత్మహత్య చేసుకుంటే అతని కుటుంబాన్ని పరామర్శించే తీరిక ఈ ప్రభుత్వానికి  లేకుండా పోయింది. 750 మందికి పైగా రైతలు ఆత్మహత్య చేసుకుంటే ఈ ప్రభుత్వానికి చీమకుట్టినట్టు కూడా లేదు.

రాజధాని కోసం భూములిచ్చిన రైతులను రోడ్డున పడేశారు. మూడు రాజధానుల నిర్ణయంతో 90 మందికి పైగా రైతులు చనిపోతే ఈ ప్రభుత్వం పట్టించుకోవడంలేదు. విలువలు లేని ప్రభుత్వమిది. జగన్మోహన్ రెడ్డి పాలనలో దోపిడీ వర్గమొక్కటే సంతోషంగా ఉంది.  తమకున్న భూములను ఎక్కడ ఆక్రమిస్తారోనని దళిత మహిళలు భయాందోళనకు గురవుతున్నారు.

ఆత్మహత్యలు చేసుకున్న కుటుంబాలకు టీడీపీ అండగా నిలుస్తుంటే.... అధికారంలో ఉన్న వైసీపీకి చీమకుట్టినట్టు కూడా లేదు.. సలాం కుటుంబం ఆత్మహత్యకు వైసీపీ ప్రభుత్వం, పోలీసులదే బాధ్యత. పసి పిల్లలు చనిపోయినా ఈ ప్రభుత్వంలో చలనం లేకపోగా ప్రశ్నించిన వారిపై ఎదురుదాడి చేస్తోంది. సాయంత్రం ఐదు గంటల తర్వాత పోస్టుమార్టమ్ ఎందుకు చేశారు? ముస్లిం సంప్రదాయాలకు విరుద్ధంగా మృతదేహాలను పూడ్చిపెట్టేశారు. 

వైసీపీ పాలనలో బీసీలకు అడుగడుగునా అన్యాయం జరుగుతోంది.టీడీపీ విజయవంతంగా అమలు చేసిన ఆదరణ పతకాన్ని నిర్వీర్యం చేశారు. వేధింపులపై ప్రశ్నించిన శ్రీకాంత్, వరప్రసాద్ పై కక్ష కట్టి శిరోముండనం చేశారు. రాష్ట్రంలో జరుగుతున్నవి హత్యలో ఆత్మహత్యలో తెలియని పరిస్థితి నెలకొంది. లిక్కర్ మాఫియాపై ప్రశ్నించిన పుంగనూరు యువకుడు ఆత్మహత్య చేసుకునేలా ప్రేరేపించారు.

ఎంతసేపూ వసూళ్ల గురించి మాత్రమే ఈ ప్రభుత్వం ఆలోచిస్తోంది. సకాలంలో పింఛన్ అందక ఆత్మహత్యలు చేసుకుంటుంటే ప్రభుత్వానికి పట్టడం లేదు. అమ్మఒడి ఎందరికి ఇచ్చారో ఈ ప్రభుత్వం సమాధానం చెప్పాలి. టీడీపీ సానుభూతి పరులకు ప్రభుత్వ పథకాలు అందకుండా చేస్తున్నారు. 

ఏపీ కంటే బీహార్ నయంగా ఉంది. ఇంతటి రాక్షస పాలన గతంలో ఎప్పుడూ చూడలేదు. పాలన చేతకాని వైసీపీ నేతలు టీడీపీని విమర్శించడమేంటి ? రాష్ట్రంలో జరుగుతున్న హత్యలు, ఆత్మహత్యలపై ప్రభుత్వం శ్వేత పత్రం విడుదల చేయాలి. అన్ని ఘటనలపై సీబీఐ విచారణ జరిపించాలి" అని డిమాండ్ చేశారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు