ఇది కోవిడ్ మహమ్మారి కాలం... ఎందరో తల్లితండ్రులు కోవిడ్ బారిన పడి చనిపోతే, పిల్లలు అనాధలైపోతున్నారు. ఈ దురదృష్టాన్ని కూడా క్యాష్ చేసుకుంటూ, అనాధ పిల్లల పేరిట చందాలు వసూలు చేస్తున్నారు కొందరు స్వార్ధపరులు.
కృష్ణా జిల్లా నూజివీడు మండలం తుక్కులూరు గ్రామంలో హైదరాబాద్ నుంచి వచ్చిన ముగ్గురు పాస్టర్లు ట్రస్ట్ ముసుగులో హైడ్రామా ఆడుతున్నారు. గ్రామానికి చెందిన ఆరుగురు వ్యక్తులను వారికి తెలియకుండానే డైరెక్టర్లుగా పెట్టి అనాధల కోసం ట్రస్ట్ స్థాపించేశారు. గ్రామానికి చెందిన 25కుటుంబాలకు చెందిన పిల్లలకు యాపిల్ కాయ ఇస్తూ, అనాధ పిల్లలకు తాము ఎంతో చేస్తున్నట్లు బిల్డప్ ఇచ్చారు. ఇవే ఫోటోలు తీసి ఫేస్‌బుక్‌లో పెట్టి నాలుగు కోట్ల రూపాయల ఫండ్ కావాలని, మానవతావాదులకు, ధనికులందరికీ పంపుతూ... దందా చేస్తున్నారు.
అయితే, తాము బతికుండగానే ... తమ పిల్లలు కొందరిని అనాధలుగా, మతిస్థిమితం లేని పిల్లలుగా ఫేస్ బుక్ లో పెట్టడాన్ని గుర్తించిన తల్లిదండ్రులు షాక్ అయ్యారు. ఈ దందా చేస్తున్న గ్రామానికి చెందిన బొడ్డు శ్రీనివాస్ ఇంటికి వెళ్ళిన పిల్లల తల్లిదండ్రులు అక్కడ మరో ఇద్దరు పాస్టర్లు ఉండటాన్ని గమనించారు.