పార్టీ బలోపేతంపై దృష్టిపెట్టిన పవన్ కళ్యాణ్: నాగబాబుకు కీలక పదవి

శుక్రవారం, 26 జులై 2019 (20:59 IST)
2019 అసెంబ్లీ ఎన్నికల్లో ఘోరపరాజయం పాలైన జనసేన పార్టీ బలోపేతంపై దృష్టి సారించింది. జనసేనను గ్రామస్థాయి నుంచి బలోపేతం చేసేందుకు రంగం సిద్ధం చేస్తోంది. సంస్థాగతంగా పార్టీబలోపేతంపై కీలక కమిటీలు వేసిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మరో కీలక కమిటీని ప్రకటించారు. 
 
జనసేన పొలిటికల్ బ్యూరోను ప్రకటించారు. ఈ పొలిటికల్ బ్యూరోలో నలుగురు సభ్యులకు అవకాశం కల్పించారు. పార్టీ సీనియర్ నేత నాదెండ్ల మనోహర్, పి.రామ్మోహన్ రావు, రాజు రవితేజ, అర్హంఖాన్ లను జనసేన పొలిటికల్ బ్యూరోలో సభ్యులుగా కొనసాగనున్నట్లు ప్రకటించారు.  
 
మరోవైపు జనసేన పార్టీ పొలిటికల్ అఫైర్స్ కమిటీని కూడా ప్రకటించారు పవన్ కళ్యాణ్. జనసేన పొలిటికల్ అఫైర్స్ కమిటీ చైర్మన్ గా పార్టీ సీనియర్ నేత నాదెండ్ల మనోహర్ ను నియమించారు. నాదెండ్ల మనోహర్ సారథ్యంలో ఏర్పాటైన పొలిటికల్ అఫైర్స్ కమిటీలో 11 మంది సభ్యులకు అవకాశం కల్పించారు. సభ్యుల్లో పవన్ కళ్యాణ్ సోదరుడు నాగబాబుకు అవకాశం కల్పించారు. 
 
నాగబాబుతోపాటు ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్, తోట చంద్రశేఖర్ కందుల లక్ష్మీ దుర్గేష్, కోన తాతారావు, ముత్తా శశిధర్ లతోపాటు మరికొంతమందికి అవకాశం కల్పించారు. ఇకపోతే పార్టీ క్రమశిక్షణ సంఘం చైర్మన్ గా పార్టీ సీనియర్ నేత మాదాసు గంగాధరం ను నియమిస్తూ ప్రకటన విడుదల చేశారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు