పవన్‌తో చతురు కాదు, ఏపీలో వైసిపి లేదు, బూతు నాయకులను ఏరేయండి: జగన్‌కి ఉండవల్లి సలహా

ఐవీఆర్

శుక్రవారం, 14 జూన్ 2024 (13:21 IST)
జగన్ మోహన్ రెడ్డి పార్టీ వైసిపి పతనానికి కేవలం పవన్ కల్యాణ్ మాత్రమే కారణమని మాజీ ఎంపి ఉండవల్లి అరుణ్ కుమార్ అన్నారు. ఆయన మాట్లాడుతూ... ఎవడి తలరాతనైనా తలకిందులు చేయగల సత్తా పవన్ కల్యాణ్‌కి వున్నదనడంలో ఎంతమాత్రం సందేహం లేదు. వచ్చే ఐదేళ్ల తర్వాత అధికారంలోకి రావాలనే అనుకునే ముందు అసలు మీ పార్టీ ఏపీలో వుందో లేదో చూడండి. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ కూడా వైసిపి లేనేలేదు. పార్టీలో పైన జగన్ వున్నారు, కింద ఓటర్లు వున్నారు, మధ్యలో వాలంటీర్లు వున్నారు.
 
వాలంటీర్లకు ఎవరు ఎక్కువ జీతం ఇస్తే వారికోసం పనిచేస్తారు తప్పించి ఓట్లు వేయించే పని వాళ్లెందుకు తీసుకుంటారు? రాష్ట్రంలో జగన్ మోహన్ రెడ్డి అనే వ్యక్తిని దించేయాలనే ఒకే ఒక్క నినాదాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లడంలో పవన్ కల్యాణ్ విజయవంతమయ్యారు. అంతేకాదు.. ఏపీలో తెలుగుదేశం పార్టీ బలం చాలా సమర్థవంతంగా వుంది. ఆ పార్టీని ఎదుర్కోవడం అంత తేలిక కాదు. వచ్చే ఐదేళ్లలో పార్టీని బలంగా తయారుచేసుకునేందుకు ప్రణాళికలు వేసుకోండి.
 
మీడియా ముందు మాట్లాడేందుకు వస్తున్న నాయకులు ఏం మాట్లాడుతున్నారు? బూతులు తప్ప వాళ్లేమీ మాట్లాడలేదు. అలాంటి బూతులు మాట్లాడుతుంటే ప్రజలు అసహ్యించుకుంటారు. అందుకే పద్ధతిగా మాట్లాడేవారిని, వ్యక్తిగతంగా కాకుండా పాలనాపరమైన సమస్యలపై మాట్లాడేవారిగా ట్రెయినింగ్ ఇప్పించండి. ఇలా చేయకపోతే వచ్చే ఐదేళ్ల తర్వాత కూడా కష్టమే అంటూ చెప్పారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు