తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ గారికి ఒక‌టే విన్న‌పం.... పవన్ కల్యాణ్

గురువారం, 7 మార్చి 2019 (21:40 IST)
మొన్న ఓటుకు నోటు , నిన్న నాగార్జున సాగ‌ర్ ద‌గ్గ‌ర రెండు రాష్ట్రాల పోలీసుల గొడ‌వ‌, నేడు డేటా చోరీ కేసు. ఇలా తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ గారు, ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు గారు ఆడుతున్న రాజ‌కీయ చద‌రంగంలో రెండు రాష్ట్రాల యువ‌త న‌లిగిపోతోంద‌ని జ‌న‌సేన పార్టీ అధ్య‌క్షులు శ్రీ ప‌వ‌న్ క‌ళ్యాణ్ స్ప‌ష్టం చేశారు. 
 
ఇద్ద‌రు బ‌ల‌మైన నాయ‌కులు ఆడుతున్న రాజ‌కీయ క్రీడ‌లో ప్ర‌జ‌లు న‌ష్ట‌పోతున్నార‌ని తెలిపారు. ప‌ల్నాడు గ‌డ్డ నుంచి తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ గారికి ఒక‌టే విన్న‌పం చేస్తున్నాను. ఉద్య‌మం స‌మ‌యంలో చాలా తిట్టారు, మీ ఉద్య‌మ స్ఫూర్తిని అర్ధం చేసుకుని భ‌రించామ‌ని, రాష్ట్ర విభ‌జ‌న త‌ర్వాత కూడా రెండు రాష్ట్రాల మ‌ధ్య గొడ‌వలంటే ప్ర‌జ‌లు భ‌రించే స్థితిలో లేర‌ని తెలిపారు. ఒక‌వైపు తెలుగుదేశం పార్టీ మాతో క‌లిసి రావాలని పిలుస్తోంది, మ‌రోవైపు టీఆర్ఎస్ పార్టీ జ‌గ‌న్, ప‌వ‌న్‌ను క‌లుపుతాం అంటుంది. ఈ పొలిటిక‌ల్ గేమ్స్ చూసి చూసి విసుగొచ్చిందని అన్నారు. 
 
2019 సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో జ‌న‌సేన పార్టీ సీపీఐ, సీపీఎంతో త‌ప్ప ఏ పార్టీతో క‌లిసి పోటీ చేయ‌దని పున‌రుద్ఘాటించారు. జ‌న‌సేన పార్టీ ప్ర‌జ‌ల ప‌క్షమే గానీ పార్టీల ప‌క్షం కాద‌న్నారు. ప‌వ‌న్ క‌ళ్యాణ్ చెపుతూ.. "ప‌ల్నాడుతో ప్ర‌త్యేక అనుబంధం ఉంది. పన్నెండో శతాబ్దంలోనే బ్ర‌హ్మ‌నాయుడు అన్ని కులాలనూ సమంగా చూసిన గొప్ప వ్యక్తి. ఆయన కులాలను సమంగా చూసేందుకు చాప కూడు అనే సహపంక్తి   భోజనాలను తీసుకొచ్చారు. 
 
బ్రహ్మనాయుడు తిరుగాడిన నేల సాక్షిగా చెబుతున్నా.. అన్ని కులాలు, మ‌తాలు, ప్రాంతాల‌ను స‌మానంగా చూసే విధానాన్ని తీసుకొస్తాం. అంద‌ర‌ని స‌మానంగా చూడ‌గ‌లిగే ప‌ల్నాడు నేల నేడు కొన్ని కుటుంబాల చేతిలో ఇరుక్కుపోయి న‌లిగిపోతుంది. ఆ కుటుంబాల చెర నుంచి ప్ర‌జ‌ల‌కు విముక్తి క‌లిగించ‌డానికే జ‌న‌సేన పార్టీ పెట్టాను. ఆర్థికంగా, సామాజికంగా వెనుక‌బ‌డిన అంద‌రికి స‌మాన అవ‌కాశాలు క‌ల్పిస్తాం అన్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు