ఆపద మొక్కులవాడిని దర్సించుకునేందుకు భక్తులు పోటీపడుతున్నారు. సుమారు 80 రోజుల పాటు స్వామివారి దర్సనం నిలిచిపోవడంతో భక్తులకు రేపటి నుంచి మళ్లీ ఆ అవకాశం దక్కింది. ఆ స్వామివారిని ఎలాగైనా దర్సించుకోవాలని భక్తులు పెద్ద ఎత్తున తిరుపతికి చేరుకున్నారు. రేపటి దర్సనం కోసం టిటిడి టోకెన్లు ఇస్తున్న నేపథ్యంలో భక్తులందరూ క్యూలైన్లలో పడిగాపులు కాచారు.
అయితే కేవలం మూడు ప్రాంతాల్లో టోకెన్లు ఇస్తుండటంతో భక్తుల క్యూలైన్లు కిలోమీటర్ల మేర కనిపించింది. ఒకరిద్దరు కాదు ఒక్కో కౌంటర్ వద్ద 5వేల మందికి పైగా భక్తజనం కనిపించారు. ఆధార్ కార్డులు చేతపట్టుకుని టోకెన్ల కోసం వేచి ఉన్నారు. తిరుపతిలోని భూదేవి కాంప్లెక్స్, విష్ణునివాసం, శ్రీనివాసం వసతి సముదాయాలలో టోకెన్లను జారీ చేశారు.
ఆన్ లైన్‌లో ఇప్పటికే 3 వేల టిక్కెట్లు పొందుపరచగా వాటిని పొందారు భక్తులు. ఇక ఆఫ్ లైన్లో కౌంటర్ల ద్వారా ఇచ్చే టిక్కెట్ల కోసం బారులు తీరారు. స్వామివారి దర్సనం కోసం సామాజిక దూరాన్ని పూర్తిగా గాలికొదిలేశారు. టిటిడి సిబ్బంది భక్తులను వారించే ప్రయత్నం చేస్తున్నా వారు పట్టించుకోవడంలేదు. ఎక్కడ టిక్కెట్లు అయిపోతాయేమోనని భక్తులు నిరాశలో కూడా కనిపించారు.