వై.ఎస్.ఆర్.సి.పి. అధినేత వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి తన సలహాదారు ప్రశాంత్ కిషోర్ చెప్పిన మాటలను తూచా తప్పకుండా పాటిస్తున్నారు. పాదయాత్రలో మాట్లాడాల్సిన స్క్రిప్టు నుంచి పార్టీలో తీసుకునే నిర్ణయం వరకు పి.కె. చెబుతున్నదే చేస్తున్నారని తెలుస్తోంది. ప్రతి విషయాన్ని పి.కె. చూస్తుండటంతో ఆయన సలహా లేనిదే ఏ పని చేయడం లేదు జగన్. జగన్ ఒక్కరే కాదు కొంతమంది వైసిపి సీనియర్ నేతలు కూడా అదే పనిచేస్తున్నారు.
తాజాగా పవన్ కళ్యాణ్‌తో వైసిపికి పెద్ద చిక్కే వచ్చి పడింది. అందుకే జగన్ జనసేన అధినేత వ్యాఖ్యలపై పెద్దగా ఎక్కడా స్పందించలేదు. అక్కడక్కడా పాదయాత్రలో మాట్లాడుతున్నా పెద్దగా విమర్శలు మాత్రం చేయడం లేదు. అంతేకాదు వై.ఎస్.ఆర్.సి.పి. నేతలెవరనీ కూడా పవన్ పైన విమర్శలు చేయవద్దని చెబుతున్నారట జగన్. పి.కె.సలహా ప్రకారం ఇదంతా ఫాలో అవుతున్నాడట.
పవన్ కళ్యాణ్ తీవ్రస్థాయిలో వైసిపిపై విమర్సలు చేస్తున్న విషయం తెలిసిందే. ప్రజా సమస్యలపై స్పందించాల్సిన ప్రధాన ప్రతిపక్షం కాస్తా చేతకాని పరిస్థితికి వెళ్ళిపోయిందని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు పవన్ కళ్యాణ్. అయితే జగన్ మాత్రం దీన్ని పెద్దగా పట్టించుకోలేదు. పవన్‌ను విమర్శిస్తే ప్రజల్లో తప్పుడు సంకేతాల వెళ్ళే పరిస్థితి ఉందని సలహాదారు పి.కె. జగన్‌కు చెప్పారట. దీంతో జగన్‌తో పాటు వైసిపి నేతలెవరూ పవన్ కళ్యాణ్‌ను విమర్శించకూడదన్న నిర్ణయానికి వచ్చారట.