మోడీ ప్లాన్‌తో జగన్‌కు చెక్ ... అమరావతి తరలింపు ఇప్పట్లో లేనట్టేనా?

మంగళవారం, 14 ఏప్రియల్ 2020 (18:18 IST)
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వేసిన ప్లాన్‌తో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి దూకుడుకు బ్రేక్ పడినట్టయింది. కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు ప్రస్తుతం అమల్లో ఉన్న లాక్‌డౌన్‌ను మరో 19 రోజుల పాటు పొడగిస్తూ ప్రధాని నరేంద్ర మోడీ మంగళవారం జాతినుద్దేశించి చేసిన ప్రసంగంలో పేర్కొన్నారు. దీంతో సీఎం జగన్ అమలు చేయాలన్న వ్యూహాలకు గండిపడినట్టయింది. 
 
నిజానికి లాక్‌డౌన్ పొడగింపుతో పాటు కరోనాకు వైరస్ కట్టడికి తీసుకోవాల్సిన చర్యలపై ప్రధాని మోడీ వరుసగా ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ సమావేశం నిర్వహించారు. ఇందులో అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు మాత్రం లాక్‌డౌన్‌ను పొడగించాలని విజ్ఞప్తి చేశారు. కానీ, ఒక్క జగన్మోహన్ రెడ్డి మాత్రం లాక్‌డౌన్ ఎత్తివేసి, కరోనా హాట్‌స్పాట్‌లలో మాత్రం వైరస్ వ్యాప్తి చెందకుండా గట్టి చర్యలు తీసుకోవాలని కోరారు. కానీ, ఆయన మనసులో మరోరకమైన ఆలోచనలు ఉన్నాయి. 
 
లాక్‌డౌన్ పొడగింపు అంశాన్ని పూర్తిగా ఆయా రాష్ట్రాలకే వదిలివేస్తారని సీఎం జగన్ లోలోపల గట్టిగా భావించార. కానీ, ప్రధాని మోడీ ప్రకటనతో ఆయన అంచనాలన్నీ తలకిందులయ్యాయి. మరో మూడు వారాలు లాక్‌డౌన్‌ ఉండనుంది. అయితే.. ఏప్రిల్‌- 20 తర్వాత అత్యవసర సర్వీసులకే షరతులతో మినహాయింపులు ఉంటాయని మోడీ ప్రకటించిన విషయం విదితమే. కేంద్రం పకడ్బందీ వ్యూహంతో జగన్‌ ప్లాన్స్‌కి బ్రేకులు పడ్డాయని దీన్ని బట్టి తెలుస్తోంది.
 
ముఖ్యంగా, మే నెలలో తన రాజకీయ అజెండాను అమలు చేయాలని జగన్ ప్లాన్ వేశారు. ముఖ్యంగా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించడం, రాజధాని అమరావతి నిర్మాణం కోసం సేకరించిన భూములను పేదలకు ఇళ్ళ స్థలాలుగా కేటాయించడం, అమరావిని వైజాగ్‌కు తరలించడం, హైకోర్టును కర్నూలుకు మార్చడం ఇత్యాది వ్యూహాలను అమలు చేయాలని భావించారు. 
 
ఈ అంశాలపై జగన్‌పై జనం తీవ్ర ఆగ్రహంతో కూడా రగిలిపోతున్నారు. ప్రతిపక్షాలు, ప్రజా సంఘాలు దుయ్యబట్టాయి. మరీ ముఖ్యంగా ఎన్నికల కమిషనర్‌ని కూడా మార్చి స్థానిక ఎన్నికలకు వెళ్లాలని సీఎం ఎత్తుగడలు వేశారు. రెడ్‌జోన్లు, హాట్‌స్పాట్లను కూడా కుదించే దిశగా నిర్ణయాలు తీసుకోవాలని అనుకున్నారు. ఏపీలో కరోనా కేసులు పెద్దగా లేవంటూ తక్కువ చేసి చూపే ప్రయత్నం చేయగా.. పీఎం మోడీ ప్రకటనతో జగన్‌ ప్రయత్నాలకు బ్రేకులే పడ్డాయని విశ్లేషకులు చెబుతున్నారు.
 
లాక్‌డౌన్‌ 3 వారాల పొడిగింపుతో సొంత అజెండా అమలుదారులన్నీ మూసుకుపోయాయని తెలుస్తోంది. 20 తర్వాత అత్యవసర సర్వీసులకు మాత్రమే షరతులతో మినహాయింపులివ్వడంతో.. ఇక అమరావతి తరలింపు ఎత్తుగడలకూ బ్రేక్‌ పడినట్లయ్యింది. మొత్తానికి చూస్తే.. మోడీ ప్రకటనతో ఏపీలో రాజకీయ సమీకరణాలు కొలిక్కివస్తున్నాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఏది ఏమైనా లాక్‌డౌన్ పొడగింపుతోనైనా ఆంధ్రాకు మేలు జరిగితే అదేచాలని ప్రజలతో పాటు.. విపక్ష పార్టీల నేతలు అభిప్రాయపడుతున్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు