ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామిపై హైదరాబాద్ నగరంలో పోలీసు కేసు నమోదైంది. తెలంగాణ ప్రాంతానికి చెందిన సీనియర్ కాంగ్రెస్ నేత మల్లు రవి ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు ఈ కేసు నమోదు చేశారు. ఏపీ ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ గురించి అసత్య వ్యాఖ్యలు చేశారంటూ మల్లు రవి బేగం బజార్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. నారాయణస్వామిపై చర్యలు తీసుకోవాలని తన ఫిర్యాదులో కోరారు.
ఉమ్మడి ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణానికి సోనియా గాంధీ, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడులే కారణమని రాయణస్వామి ఇటీవల షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరిన నేపథ్యంలో వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలను మల్లు రవి తప్పుబట్టి, సీరియస్‌గా తీసుకున్నారు. ఉమ్మడి ఏపీ సీఎంగా వ్యవహరించిన వైఎస్సార్‌కు సోనియా ఎంతో ప్రాధాన్యతనిచ్చారని గుర్తుచేశఆరు.
వైఎస్సార్ హెలికాప్టర్ ప్రమాదానికి గురైనప్పుడు సోనియా ప్రత్యేకంగా విమానాలు పంపించి వెతికించారని తెలిపారు. ప్రతికూల వాతావరణం వల్లే హెలికాప్టర్ ప్రమాదం జరిగిందన్న విషయాన్ని ఏపీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి గ్రహించాలని మల్లు రవి హితవు పలికారు. నారాయణస్వామి తన వ్యాఖ్యలను ఉపసంహరించుకోకపోతే తీవ్ర పర్యవసానాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని స్పష్టం చేశారు.