విశాఖ ఉక్కు కోసం 27న మహాగర్జన - విశాఖ ఉక్కు పోరాట కమిటీ

సోమవారం, 26 డిశెంబరు 2022 (08:13 IST)
ఆంధ్రుల హక్కు.. విశాఖ ఉక్కుగా పేర్కొనే విశాఖపట్టణం ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటుపరం కాకుండా పోరాటం ఉధృతం చేయాలని  విశాఖ ఉక్కు పోరాట కమిటీ నిర్ణయించింది. ఇందులోభాగంగా, ఈ నెల 27వ తేదీన లక్ష మందితో ప్రజా గర్జన నిరసన కార్యక్రమం చేపట్టాలని నిర్ణయించింది. గతంలో తెలంగాణ రాష్ట్రంలో జరిగిన ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం, తమిళనాడులో జల్లికట్టు క్రీడ కోసం సాగిన ఉద్యమాల తరహాలో ఈ పోరాటం సాగించాలన్న నిర్ణయానికి వచ్చారు.
 
ఇదే అంశంపై ఏఐటీయూసీ కార్యాలయంలో విశాఖ ఉక్కు పోరాట కమిటీ నేతలు మీడియాతో మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వ నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఉద్యమానికి సిద్ధమవుతున్నట్టు చెప్పారు. 32 మంది అమరుల ప్రాణ త్యాగంతో విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని దక్కించుకున్నామని, ఇపుడు దాన్ని ప్రైవేటుపరం చేసేందుకు కేంద్రం పావులు కదపడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్టు పేర్కొన్నారు. 
 
కరోనా సమయంలో కార్మికులు ప్రాణాలకు తెగించి పనిచేశారని, సొంత మైన్స్ లేకపోయినా ఫ్యాక్టరీని లాభాల బాటలో నడిపించామని పేర్కొన్నారు. రాష్ట్రానికి స్టీల్ ప్లాంట్ ఒక ఆర్థిక వనరు అని, దేశానికే తలమానికం అని అన్నారు. అందువల్ల ఈ ఫ్యాక్టరీని కాపాడుకునేందుకు తమిళనాడులో జల్లికట్టు, తెలంగాణా ఉద్యమాన్ని స్ఫూర్తిగా తీసుకుని ఈ పోరాటం చేస్తామని వారు ప్రకటించారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు