అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రియల్ టైమ్ గవర్నెన్స్ అనే వినూతన్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టి మంచి ఫలితాలు సాధించడం పట్ల భారత రాష్ట్రపతి రామ్‌నాధ్ కోవింద్ పూర్తి సంతృప్తిని వ్యక్తం చేయడంతోపాటు ముఖ్యమంత్రి ఎన్.చంద్రబాబు నాయుడుకు ప్రభుత్వానికి ప్రత్యేకంగా అభినందనులు తెలిపారు. బుధవారం అమరావతి సచివాలయంలోని మొదటి భవనంలోని రాష్ట్ర స్థాయి రియల్ టైమ్ గవర్నెన్స్ మరియు కమాండ్ కంట్రోలు కేంద్రాన్ని ఆయన సందర్శించారు.
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు నాయుడు రియల్ టైమ్ గవర్నెన్స్ విధానంపై రాష్ట్రపతికి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. ముఖ్యమంత్రి ప్రజెంటేషన్ తర్వాత రాష్ట్రపతి రామ్‌నాధ్ కోవింద్ మాట్లాడుతూ రియల్ టైమ్ గవర్నెన్స్ అనే వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టి మంచి ఫలితాలు సాధించడం పట్ల తాను ఎంతో గర్వపడుతున్నానని ఆయన పూర్తి సంతృప్తిని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి ప్రభుత్వ యంత్రాంగానికి ప్రత్యేక అభినందనలు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఫైబర్ నెట్, ఆర్టీజీ వంటి వినూత్న విధానాలు చేపట్టడం ద్వారా టెక్నాలజీ ఇంటిగ్రేషన్‌తో సాంకేతిక రంగంలో ఎంతో అభివృద్ధి సాధిస్తోందని రామ్ నాధ్ కొనియాడారు. ఈ విధానం ద్వారా రాష్ట్రంలో సాధించిన ఫలితాలు కేవలం ఎపికే పరిమితం కాకుండా దేశమంతటికీ ఇవి ఉపయోగపడే రీతిలో జాతీయ స్థాయిలో ఆర్టీజిపై ప్రజెంటేషన్ ఇవ్వాలని రాష్ట్రపతి ముఖ్యమంత్రికి సలహా ఇచ్చారు. జాతీయ స్థాయిలో ప్రధానమంత్రి నరేంద్ర మోది నేతృత్వంలో మేకిన్ ఇండియా, డిజిటల్ ఇండియా వంటి కార్యక్రమాలు చేపట్టడం జరిగిందని వాటికి ఈకార్యక్రమాలు ఒక ప్రేరణగా నిలుస్తాయని రాష్ట్రపతి కోవింద్ పేర్కొన్నారు.