సింఘు, ఘాజీపుర్, టిక్రీ తదితర సరిహద్దు ప్రాంతాల్లో కేంద్ర హోం శాఖ శుక్రవారం రాత్రి 11 గంటల నుంచి ఇంటర్నెట్ సేవలను తాత్కాలికంగా నిలిపివేసింది. జనవరి 31 రాత్రి 11 గంటల వరకు ఈ ఆంక్షలు కొనసాగుతాయని వెల్లడించింది. అవాంఛనీయ పరిస్థితులు తలెత్తకుండా, ప్రజల భద్రత దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు హోంశాఖ తెలిపింది.
రైతులు సరిహద్దును వీడి వెళ్లాలని స్థానికులుగా చెప్పుకొంటున్న కొందరు కర్రలతో వచ్చి సింఘు సరిహద్దులో ఘర్షణ పడ్డారు. రైతుల గుడారాలపైకి రాళ్లు రువ్వారు. దీంతో పరిస్థితిని అదుపుచేసేందుకు రంగంలోకి దిగిన పోలీసులు లాఠీఛార్జ్ చేసి, బాష్పవాయువు ప్రయోగించారు.