ఢిల్లీలోని ఇజ్రాయెల్ దౌత్యకార్యాలయం వద్ద పేలుడు

శుక్రవారం, 29 జనవరి 2021 (18:54 IST)
ఢిల్లీలోని ఇజ్రాయెల్ దౌత్యకార్యాలయం వద్ద శుక్రవారం సాయంత్రం పేలుడు సంభవించింది. ఎంబసీ భవనం ఉన్న పేవ్‌మెంట్‌పై ఈ పేలుడు జరిగినట్టు వెల్లడించారు. ఈ పేలుడు కారణంగా అక్కడ పార్క్ చేసున్న నాలుగు కార్ల అద్దాలు పగిలిపోయాయి.
 
అయితే ఈ పేలుడులో ఎవరూ గాయపడలేదు. అదేసమయంలో పేలుడు వార్త తెలుసుకున్న వెంటనే ఆ ప్రాంతంలో భారీ ఎత్తున పోలీసు బలగాలను మొహరించారు. ముఖ్యంగా, అబ్దుల్ కలాం రోడ్డు మొత్తం పోలీసుల వలయంలోకి వెళ్లిపోయింది. ఐఈడీ (పేలుడు పదార్థాలు) ఉన్న బ్యాగును పేవ్‌మెంట్‌పై ఉంచి దుండగులు వెళ్లిపోయారని పోలీసులు తెలిపారు. 
 
పేలుడు సంభవించిన ప్రాంతం రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్, ప్రధాని నరేంద్ర మోడీ, ఇతర ప్రముఖులు పాల్గొంటున్న 'బీటింగ్ ది రిట్రీట్ సెరమొనీ' జరుగుతున్న ప్రాంతానికి కేవలం 2 కిలోమీటర్ల దూరంలో ఉంది. పేలుడు నేపథ్యంలో ఒక్కసారిగా అలజడి చెలరేగింది. ఢిల్లీ నగర వ్యాప్తంగా భద్రతా బలగాలతో పాటు పోలీసులను అప్రమత్తం చేశారు. అనుమానాస్పద వ్యక్తులను అదుపులోకి తీసుకుంటున్నారు.  

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు