పాఠశాలలో మోటార్ మరమ్మతులో ఉందని హెడ్‌మాష్టర్ చెప్పడంతో, మరి సెలవురోజుల్లో ఎందుకు బాగు చేయించలేదని ప్రశ్నించలేదని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. పాఠశాలల్లో మరుగుదొడ్లు ఎంతో అవసరమని, ముఖ్యంగా టాయిలెట్స్ లేకపోవడం వల్ల ఆడపిల్లలు అనేక రకాల వ్యాధులబారిన పడుతున్నారని చెప్పారు. ప్రయివేటు పాఠశాలల కంటే మెరుగైన సౌకర్యాలను కల్పించి, ప్రభుత్వ పాఠశాలలను అత్యున్నతంగా తీర్చిదిద్దాలన్నదే ఈ కార్యక్రమం వెనుక ముఖ్యమంత్రి జగన్‌మోహనరెడ్డి లక్ష్యమని స్పష్టం చేశారు.
ప్రయివేటు పాఠశాలల కంటే, ప్రభుత్వ బడుల్లోనే అత్యున్నత విద్యార్హత, అంకితభావం, సమర్ధత కలిగిన ఉపాధ్యాయులు ఉన్నారని అన్నారు. అవసరమైతే గ్రామంలోని ప్రయివేటు పాఠశాలలను సందర్శించి సరిపోల్చుకోవాలని, వాటికి మించిన రీతిలో వసతులను కల్పించి తీర్చిదిద్దాలని సూచించారు. విద్యార్థుల హాజరు శాతాన్ని ప్రవీణ్ ప్రకాష్ పరిశీలించారు.
ఏయే తరగతులకు ఎంతమంది వస్తున్నదీ వాకబు చేశారు. సుమారు 73 శాతం హాజరు ఉన్నదని, ఇది క్రమేపీ పెరుగుతోందని ఉపాధ్యాయులు తెలిపారు. పేరెంట్స్ కమిటీతో, ఉపాధ్యాయులతో మాట్లాడారు. జగనన్న విద్యాకానుక, యూనిఫారాలుపై వాకబు చేశారు. ముఖ్యమంత్రి సుమారు 10 గంటల సమయం వెచ్చించి, జగనన్న విద్యాకానుకను ఖరారు చేశారని చెప్పారు.
అందువల్ల ప్రతీ విద్యార్థీ తప్పనిసరిగా యూనిఫారం, సాక్సులు, బూట్లు వేసుకొని వచ్చేవిధంగా చర్యలు తీసుకోవాలని ఉపాధ్యాయులను ఆదేశించారు. ప్రభుత్వ పాఠశాలలకు వచ్చే పిల్లలు కూడా మన పిల్లలు లాంటివారేనని భావించాలని, ఇళ్లల్లో మన పిల్లలకు ఎలా సౌకర్యాలు కల్పిస్తున్నామో, వారికి కూడా వాటిని సమకూర్చాలని కోరారు. నాడూ-నేడు కార్యక్రమం లక్ష్యాన్ని దృష్టిలో పెట్టుకోవాలని, పిల్లలకు సౌకర్యాలను కల్పించడంలో నిర్లక్ష్యం తగదని ఆయన స్పష్టం చేశారు.
గ్రామంలోని సచివాలయాన్నిప్రవీణ్ ప్రకాష్ తనిఖీ చేశారు. కాపునేస్తం జాబితాను ప్రదర్శనకు ఉంచకపోవడంపై అసహనాన్ని వ్యక్తం చేశారు. ప్రజలకు పారదర్శకంగా, మరింత మెరుగైన సేవలను అందించడానికి ప్రభుత్వం ఈ వ్యవస్థను తీసుకొచ్చిందని చెప్పారు. ఇటీవల కాలంలో ఏ రాష్ట్రంలోనూ లేనివిధంగా లక్షల మంది సచివాలయ ఉద్యోగులను నియమించిన విషయాన్ని గుర్తు చేశారు.
సచివాలయంలో చేయాల్సిన ప్రధాన విధులను విస్మరించడం తగదన్నారు. ప్రతీ సచివాలయంలో తప్పనిసరిగా లబ్దిదారుల జాబితాలను ప్రదర్శించడం, ఎవరు ఏ పథకానికి అర్హులో సవివరంగా తెలియజేయడం, అలాగే ఆయా పథకాలు పొందేందుకు దరఖాస్తు చేసే విధానాన్ని కూడా సమగ్రంగా వివరించడం సచివాలయ ప్రధాన విధులని తెలిపారు. ప్రతీ సచివాలయ ఉద్యోగి తప్పనిసరిగా తాము పనిచేస్తున్న గ్రామంలోనే నివాసం ఉండాలని స్పష్టం చేశారు.
సిబ్బంది ప్రజలతో మమేకం అయి, వారి బాగోగులను పట్టించుకోవాలని సూచించారు. ఐఏఎస్ అధికారులు సైతం వారంలో 7 రోజులూ ప్రజల్లో ఉండాలని, ఆఫీసులకే పరిమితం కావడం సరికాదని ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్ స్పష్టం చేశారు. అనంతరం గజపతినగరంలోని శ్రీకృష్ణ, హర్షవర్థన ప్రయివేటు పాఠశాలలను పరిశీలించారు. గజపతినగరం సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని సైతం తనిఖీ చేశారు. అనంతరం అక్కడి బిఎస్ఆర్ ఆసుపత్రిని పరిశీలించి, ప్రభుత్వ, ప్రయివేటు సంస్థలమధ్య తేడాలను గమనించారు.