ఏపీలో కొత్తగా అధికారంలోకి వచ్చిన వైకాపా ప్రభుత్వానికి తాము కొంత సమయం ఇచ్చామని భాజపా ఎంపీ సీఎం రమేశ్ అన్నారు. రెండున్నరేళ్ల పాలనలో రాష్ట్ర ప్రజలకు వైకాపా చేసిందేమీ లేదని ఆరోపించారు. విజయవాడలో సీఎం రమేశ్ మీడియాతో మాట్లాడుతూ, తమ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ప్రజాగ్రహ సభలో వైకాపా ప్రభుత్వ వైఫల్యాలను ప్రస్తావిస్తామని చెప్పారు. సభ ప్రారంభమే కాలేదని.. అప్పుడే వైకాపాకు దడ పుట్టిందని ఆయన వ్యాఖ్యానించారు.
రాష్ట్రంలో కక్ష సాధింపులు తప్ప, ప్రభుత్వం ప్రజలకు ఏమీ చేయడం లేదని కొందరు అధికారులే చెబుతున్నారన్నారు. రాష్ట్ర భాజపాపై తెదేపా నేత పయ్యావుల కేశవ్ చేసిన వ్యాఖ్యలను మీడియా ప్రతినిధులు సీఎం రమేశ్ వద్ద ప్రస్తావించగా, తెదేపా ప్రతిపక్ష పాత్ర సరిగా పోషించి ఉంటే ఇప్పుడీ పరిస్థితి వచ్చేది కాదన్నారు. ప్రజాగ్రహ సభ ఆరంభం మాత్రమేనని చెప్పారు. రాజధానిగా అమరావతే కొనసాగుతుందని, ఈ విషయాన్ని ఘంటాపథంగా చెబుతున్నానని సీఎం రమేశ్ అన్నారు.