ఎపి ప్రభుత్వానికి పుష్కలంగా బడ్జెట్...?! ఎలాగబ్బా?
శనివారం, 17 జూన్ 2017 (15:13 IST)
రాష్ట్ర విభజన తరువాత ఎపి లోటు బడ్జెట్‌తో ఉందని అంటున్నారు. అందుకే అభివృద్థి కుంటుపడుతోందని, కేంద్ర సాయం ఖచ్చితంగా అవసరమని అప్పుడప్పుడు ఢిల్లీకి వెళ్ళి మరీ నిధులు తెచ్చుకుంటున్నారు. అమరావతి కూడా అంతంతమాత్రంగా నిర్మాణం జరుగుతోంది. ఎపిలో పెద్దగా అభివృద్థి కనిపించలేదు. కారణం లోటు బడ్జెట్. ఇదంతా తెలిసిందే. కానీ ఒక్కసారిగా బడ్జెట్ పుష్కలంగా ఉందంటున్నారు ఏంటిది. అనుకుంటున్నారా. అంతా శేషాచలం కొండల మహిమ. ఎర్రచందనాన్ని అక్రమంగా రవాణా చేస్తూ పట్టుబడిన ఎర్రచందనం దుంగలను అమ్మి లోటు బడ్జెట్‌ను పూడ్చెయ్యాలని ఆలోచనలో ఉన్నారు. అందుకు టెండర్లను కూడా పిలిచారు.
విలువైన జాతీయ సంపద ఎర్రచందనంపై ప్రభుత్వం పెట్టుకున్న ఆశలు అడియాశలవుతున్నాయి. వేల కోట్ల రూపాయలు విలువచేసే ఎర్రచందనం సంపద కళ్ళ ఎదుటే ఉన్నా దానిని అమ్మి సొమ్ము చేసుకోవడంలో ప్రభుత్వం విఫలమైంది. ఇప్పటికే పెద్ద ఎత్తున ఎర్రచందనం స్మగ్లింగ్‌కు గురవుతుంటే దాన్ని కాపాడుకోవడం కోసం ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో కోట్లు ఖర్చు చేస్తున్నారు. అయినా స్మగ్లింగ్‌ను ఆపలేకపోతున్నారు. ఇటు దొరికన సరుకును అమ్ములేకపోతున్నారు. అయితే మరోసారి ఎర్రచందనం అమ్మకానికి టెండర్లను పిలువనుండటంతో ఈసారైనా ప్రభుత్వ ఖజానాకు ఎంతోకొంత డబ్బులు వస్తాయన్న ఆశపడుతోంది ప్రభుత్వం.
ప్రపంచంలో ఎక్కడా లభించని ఎర్రచందనం లాంటి అరుదైన వృక్ష సంపద కేవలం శేషాచలం కొండల్లో మాత్రమే దొరుకుతుంది. బహిరంగ మార్కెట్లో ఎర్రచందనం విలువ కూడా కోట్ల రూపాయల్లో ఉంది. అయితే విభజన తరువాత కొత్తగా ఏర్పడిన రాష్ట్రం ఆర్థిక లోటుతో ఉండడంతో ఉన్న ఆదాయ వనరులన్నింటిని సమీకరించిన పనిలో పడింది. ఆ ప్రయత్నంలో భాగంగా ఎర్రచందనాన్ని కూడా విక్రయించడం ద్వారా పెద్ద ఎత్తున ఆదాయం సమకూరుతుందని ఆశపడింది. అందుకోసం టెండర్లను కూడా పిలిచారు. వేల టన్నుల ఎర్రచందనం విక్రయానికి పెట్టినప్పటికీ పెద్దగా స్పందన రాలేదు.
ప్రభుత్వం ఆశించిన స్థాయిలో ఆదాయం రాలేదు. అయితే నాసిరకమైన సరుకు కావడం వల్ల బహిరంగ మార్కెట్లో అంతకన్నా తక్కువ రేట్లకు స్మగ్లర్లు విక్రయిస్తుండడం వల్ల ప్రభుత్వ వేలానికి సరైన స్పందన రాలేదని భావించారు. ఆ తరువాత కాలంలో స్మగ్లింగ్‌ను పూర్తిస్థాయిలో అరికట్టడం కోసం ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంది. దీంతో బహిరంగ మార్కెట్లో ఎర్రచందనం పెద్దగా దొరకకపోవడంతో ఇప్పుడు ప్రభుత్వం పిలుస్తున్న టెండర్లకు మంచి స్పందన వస్తుందని భావిస్తున్నారు. రేణిగుంట సమీపంలోని ఎర్రచందనం గోడౌన్లను పరిశీలించిన అటవీశాఖామంత్రి సిద్ధారాఘవయ్య త్వరలోనే రెండవ దశ వేలం పాటకు సిద్థమవుతున్నామన్నారు.
గతంలో ఎదురైన అనుభవాలను దృష్టిలో ఉంచుకుని ఉన్న సరుకును శుభ్రంగా ఉంచడంతో పాటు దెబ్బతినకుండా గోడౌన్లలో నిల్వ ఉంచడం వల్ల ఈసారి మంచి రేటు పలికే అవకాశముంది. 1957.906 మెట్రిక్ టన్నుల ఎర్రచందనాన్ని ఈసారి వేలం వేయనుంది ప్రభుత్వం. ఈసారైనా వేలం పాటలో ఎర్రచందనం మంచి ధర పలికితే ప్రభుత్వానికి పెద్ద మొత్తంలో ఆదాయం వచ్చే అవకాశముంది. అసలే నిధుల కొరతతో, ఆర్థిక లోటుతో ఇబ్బంది పడుతున్న ఎపి ప్రభుత్వ ఆర్థిక వ్యవస్థ ఈసారి ఎర్రచందనం వేలంతో కొంతైనా గట్టున పడే అవకాశాలు కనిపిస్తున్నాయి.