ప్రముఖ కథా రచయిత కారా కన్నుమూత.. నిరాడంబరమైన జీవితం.. కథానిలయానికే అంకితం

శుక్రవారం, 4 జూన్ 2021 (14:03 IST)
Kalipatnam Rama Rao
ప్రముఖ కథా రచయిత కాళీపట్నం రామారావు తుదిశ్వాస విడిచారు. జిల్లాలోని ఆయన నివాసంలో శుక్రవారం ఉదయం 8:20 గంటలకు రామారావు తుదిశ్వాస విడిచారు. 1924లో శ్రీకాకుళం జిల్లా లావేరు మండలం మురపాకలో కారా మాష్టారు జన్మించారు. శ్రీకాకుళంలో కథానిలయాన్ని స్థాపించారు. యజ్ఞం, తొమ్మిది కథలకు కేంద్ర సాహిత్య అవార్డు అందుకున్నారు. గౌరవ డాక్టరేట్‌ను కారా మాష్టారు అందుకున్నారు.
 
 సరళమైన రచనా శైలితో సామాన్య పాఠకుల గుండెలకు సైతం హత్తుకునేలా సాగిన కారా మాస్టారు రచనా పరంపర, భావ ప్రాధాన్యతతో ముందుకు సాగింది. వారి కథలు తెలుగు సాహిత్యానికి వన్నెలు అద్ది జాతీయ స్థాయి గౌరవాన్ని అందించాయి.
 
1996లో కారా మాస్టారు సాహిత్య అవార్డును అందుకున్నారు. కొంతకాలంగా వయోభారంతో ఇంట్లోనే ఉన్న కారా మాష్టారు ఈరోజు కన్నుమూశారు. రామారావు మృతిపట్ల పలువురు ప్రముఖులు సంతాపం తెలిపారు. ఇక రామారావు (కారా) మృతిపట్ల డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేశారు. తెలుగు సాహిత్యానికి విశేషకృషి చేసిన ' కారా ' చిరస్మరణీయులన్నారు. 
 
కథారచనలో ఎందరికో మార్గదర్శిగా నిలిచిన కారా మాష్టారు ఎంతో నిరాడంబరమైన జీవితాన్నిగడిపి, తన జీవితాన్నంతా కథలకు, కథానిలయానికే అంకితం చేశారన్నారు. ఆయన కుటుంబ సభ్యులందరికీ తన ప్రగాఢ సానుభూతిని తెలుపుతున్నానని కృష్ణదాస్ చెప్పారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు