ప్రాతూరుకు చెందిన పాతూరి బాబూరావు కుమార్తె జయంతికి, మండల కేంద్రం కొల్లూరుకు చెందిన ఆలపాటి నాగరాజుకు ఐదేళ్ల క్రితం వివాహమైంది. వీరికి ఇద్దరు సంతానం. ఏడాది కిందట నాగరాజు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. దీంతో జయంతి ఎనిమిది మాసాల కిందట పుట్టిల్లు ప్రాతూరుకు వచ్చి ఇక్కడే తల్లిదండ్రులతో కలిసి జీవిస్తోంది.
కాగా, కొల్లూరుకు చెందిన రౌడీషీటర్ కనపాల నాగరాజు సోమవారం జయంతి మామ ఆలపాటి ఇస్సాకు వద్దకు వెళ్లి ఆమె చిరునామా చెప్పాలంటూ బెదిరించాడు. బెదిరింపులతో సరిపెట్టకుండా అతడ్ని వెంట తీసుకుని సోమవారం అర్తరాత్రి మోటారు బైకుపై ప్రాతూరు వచ్చాడు. ఇస్సాకు సాయంతో జయంతి ఉంటున్న ఇంటి వద్దకు చేరుకున్నాడు. ఇంటి వసారాలో మంచంపై నిద్రిస్తున్న ఆమెపై నాగరాజు అత్యాచార యత్నానికి పాల్పడ్డాడు.
భయంతో కేకలు వేయడంతో ఆమె తండ్రి బాబూరావు నిద్ర మేల్కొని హడావిడిగా వచ్చాడు. అత్యాచారానికి యత్నిస్తున్న నాగరాజును అడ్డుకుని కత్తితో దాడి చేశాడు. దీంతో స్వల్పంగా గాయపడిన నాగరాజు అక్కడి నుంచి బైకుపై పరారయ్యాడు. ఈలోగా ఇరుగుపొరుగు, బంధువులు పోగై రాత్రి సమయంలోనే అతడ్ని వెంబడించి ప్రాతూరు నదీతీరంలో ఉన్న ఓ డొంక వద్ద పట్టుకుని దాడిచేశారు. ఈ క్రమంలో బాబూరావు కత్తితో మరోమారు దాడిచేయడంతో నాగరాజు అక్కడికక్కడే మృతిచెందాడు. దీనిపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.