'ఆర్ఆర్ఆర్‌'కు చిత్రహింసలు.. విజయపాల్ డొంకతిరుగుడు సమాధానాలు...

ఠాగూర్

గురువారం, 14 నవంబరు 2024 (18:30 IST)
నరసాపురం మాజీ ఎంపీ, ప్రస్తుత టీడీపీ ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజును కస్టడీలోకి తీసుకుని చితకబాదడమే కాకుండా చిత్రహింసలకు గురిచేసిన కేసులో సీఐడీ విశ్రాంత ఏఎస్పీ విజయపాల్ వద్ద పోలీసులు విచారణ జరుపుతున్నారు. పోలీసులు అడుగుతున్న ప్రశ్నలకు ఆయన  డొంకతిరుగుడు సమాధానాలు ఇస్తూ తప్పించుకుంటున్నట్టు సమాచారం. దర్యాప్తు అధికారులు ఏ ప్రశ్న అడిగినా తనకు తెలియదని, గుర్తులేదని, మర్చిపోయానని అంటూ మూడు సమాధానాలు మాత్రమే చెబుతున్నారు. 
 
2021 మే నెలలో రఘురామను అరెస్టు చేసిన పోలీసులు కస్టడీలో చిత్రహింసలకు గురిచేసి, హత్యకు ప్రయత్నించినట్టు గుంటూరు నగరపాలెం పోలీస్ స్టేషనులో ఈ యేడాది జులై నెలలో కేసు నమోదైంది. ఈ కేసులో విజయపాల్ బుధవారం ఒంగోలు జిల్లా పోలీసు కార్యాలయంలో విచారణకు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 5.45 గంటల వరకు సుదీర్ఘంగా విచారించారు. దర్యాప్తు అధికారుల ప్రశ్నలకు సూటిగా సమాధానాలు చెప్పకుండా తాను ఏ తప్పూ చేయలేదని చెప్పినట్టు సమాచారం.
 
కస్టడీలో రఘురామకృష్ణరాజును ఎందుకు కొట్టారు? ఆయన అరికాళ్లపై గాయాలు ఎందుకయ్యాయి? హైదరాబాద్ ‌నగరంలో రఘురామను అరెస్టు చేసి గుంటూరు తరలించిన తర్వాత న్యాయమూర్తి ఎదుట హాజరుపర్చకుండా సీఐడీ కార్యాలయంలో రాత్రంతా ఎందుకు నిర్బంధించారు? కేసు నమోదైన గంటల వ్యవధిలోనే ఎందుకు అరెస్టు చేయాల్సి వచ్చింది? వంటి ప్రశ్నలకు తనకు తెలియదని, గుర్తులేదని, మర్చిపోయానని సమాధానం ఇచ్చారు. ఆయన చెబుతున్న సమాధానాలు వింటుంటే పోలీసులకు సైతం చిర్రెత్తుకొస్తుంది. 
 
రఘురామను కస్టడీలో కొట్టడం వల్ల మీకు ఎలాంటి ప్రయోజనం కలిగిందన్న ప్రశ్నకు తాను కొట్టలేదని విజయపాల్ సమాధానం ఇచ్చారు. కాగా, అక్టోబరు 11న గుంటూరులో విచారణకు హాజరైన విజయపాల్ అప్పుడు కూడా ఇలాంటి సమాధానాలే ఇవ్వడం గమనార్హం. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు