సంప్రదాయాల ప్రకారమే సిరిమానోత్సవం: మంత్రి బొత్స
శనివారం, 10 అక్టోబరు 2020 (22:55 IST)
ఉత్తరాంధ్ర కల్పవల్లి, విజయనగరం ప్రజల ఇలవేలుపు పైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవాన్ని సంప్రదాయాల ప్రకారమే నిర్వహించాలని జిల్లా యంత్రాంగం సూత్రప్రాయంగా నిర్ణయించింది. అయితే కోవిడ్ వ్యాప్తిని దృష్టిలో పెట్టుకొని, అన్ని నిబంధనలను పాటించాలని, భక్తుల రాకపోకలను నియంత్రించాలని భావిస్తున్నారు. దీనిపై ఒకటిరెండు రోజుల్లో విధివిధానాలు పూర్తిగా ఖరారు కానున్నాయి.
విజయనగరం పైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవం నిర్వహణపై జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎం.హరి జవహర్‌లాల్ అధ్యక్షతన, రాష్ట్ర పురపాలక శాఖామంత్రి బొత్స సత్యనారాయణ సమక్షంలో ప్రజాభిప్రాయ సేకరణ కలెక్టరేట్ ఆడిటోరియంలో జరిగింది. వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు, స్వచ్ఛంద సంస్థలు, ప్రజా సంఘాలు, పాత్రికేయులు పండుగ నిర్వహణపై తమతమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు.
భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా అమ్మవారి పండుగను సంప్రదాయాలకు అనుగుణంగానే నిర్వహించాలని అధికశాతం మంది అభిప్రాయపడ్డారు. అయితే కోవిడ్ మహమ్మారి ప్రమాదం ఇప్పటికీ పొంచి ఉందని, లక్షలాది మంది భక్తులు ఒకేచోట చేరితో, ఈ వ్యాధి మరింతగా విస్తరించే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ వ్యాధి గనుక రెండోసారి విజ్ఞంభిస్తే అదుపుచేయడం చాలా కష్టమని స్పష్టం చేశారు.
ఈ నేపథ్యంలో అమ్మవారి పండుగకు భక్తుల రాకపోకలను పూర్తిగా నియంత్రించాలని ఎక్కువమంది కోరారు. దీనికోసం పండుగ రెండు రోజులూ బస్సులను, ఆటోలను నిషేదించాలని, పట్టణంలో లాక్‌డౌన్ విధించాలని, దర్శనాలు, ఘటాలను రద్దు చేయాలని, లైవ్ టెలీకాస్ట్ ద్వారా అమ్మవారి సిరిమాను సంబరాన్ని ప్రసారం చేయాలని, భౌతిక దూరాన్ని పాటించేలా చేయాలని, తప్పనిసరిగా మాస్కులను ధరించేలా నిబంధనలను విధించాలని తదితర సూచనలు చేశారు.
ఇటీవల జరిగిన పూరి జగన్నాధస్వామి రథయాత్ర, తిరుపతి బ్రహ్మోత్సవాలు తదతర పండుగలను ఉదహరిస్తూ, భక్తులకు అనుమతి లేకుండానే, వీటిని సంప్రదాయాలప్రకారం నిర్వహించిన విషయాన్ని పలువురు గుర్తు చేశారు.
ముందుగా జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎం.హరి జవహర్‌లాల్ మాట్లాడుతూ.. వరుసగా మూడో ఏడాది కూడా అమ్మవారి ఉత్సవాలను నిర్వహించే అవకాశం రావడం తన అధృష్టమని పేర్కొన్నారు. భక్తుల రక్షణను దృష్టిలో పెట్టుకొని, వారి భద్రత కోసం అన్నిరకాల జాగ్రత్తలను తీసుకొని, ఉత్సవాన్ని నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయనున్నట్లు చెప్పారు. అందరి సలహాలు, సూచలను అనుగుణంగా తగిన నిర్ణయం తీసుకోవడం జరుగుతుందని స్పష్టం చేశారు.
విజయనగరం శాసనసభ్యులు కోలగట్ల వీరభద్రస్వామి మాట్లాడుతూ.. పైడితల్లి అమ్మవారి ఉత్సవాన్ని సంప్రదాయాలకు తగ్గట్టుగా, రాష్ట్రస్థాయి పండుగగా, ఘనంగా నిర్వహించాలని కోరారు. అయితే అమ్మవారి పండుగ అంటే లక్షలాదిమంది తరలి వస్తారని, కరోనా వ్యాప్తి నేపథ్యంలో భక్తుల రాకపోకలపై నియంత్రణ విధించాల్సిన అవసరం ఉందన్నారు.
దర్శనాల సమయంలో గానీ, జాతర సందర్భంలో గానీ భక్తుల ఏమాత్రం ఇబ్బంది పడకుండా చర్యలను చేపట్టాల్సి ఉందన్నారు. విజయనగరం ఉత్సవాలు, సాంస్కృతిక కార్యక్రమాలకు అవకాశం ఇవ్వవద్దని సూచించారు. జిల్లా యంత్రాంగం కృషి ఫలితంగా గతంలో జిల్లా 48 రోజులపాటు గ్రీన్‌జోన్‌లో నిలిచిందని, ఇప్పుడిప్పుడే పరిస్థితి కుదుటపడుతున్న తరుణంలో, లక్షలాది మంది భక్తులను ఉత్సవాలకు అనుమతిస్తే పరిస్థితి మళ్లీ దిగజారిపోయే ప్రమాదం ఉందని సూచించారు.
జిల్లా ఎస్‌పి బి.రాజకుమారి మాట్లాడుతూ.. గత ఏడెనిమిది నెలలుగా జిల్లాను కరోనా మహమ్మారి వణికించిందని, ఇప్పుడిప్పుడే పరిస్థితి కుదుట పడుతోందని చెప్పారు. కరోనా మమ్మారికి ఇప్పటికీ తగిన మందు లేదని, దీనికి నివారణ ఒక్కటే మనముందున్న ఏకైక మార్గమని స్పష్టం చేశారు. అయితే ప్రజల మనోభావాలను సైతం మనం పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం ఉందని, అందువల్ల ఉత్సవాలను మాత్రం సంప్రదాయాలకు అనుగుణంగా నిర్వహించాలని సూచించారు.
కానీ భక్తుల రాకపోకలపై పూర్తిగా నియంత్రణ విధించి, లైవ్ టెలికాస్ట్ ద్వారా ఉత్సవాలను ప్రసారం చేసి, ఇళ్లవద్దనుంచే వారంతా వీక్షించేలా ఏర్పాట్లు చేయాలని కోరారు. ఉత్సవాల నిర్వహణలో పాల్గొనేవారికి కూడా కోవిడ్ టెస్టులు చేయాలని, పాస్‌లు ఉన్నవారిని మాత్రమే అనుమతించాలని ఎస్పీ సూచించారు.
చివరిగా మంత్రి బొత్స సత్యనారాయణ తన అభిప్రాయాన్ని వెళ్లడించారు. పైడితల్లి అమ్మవారి పండుగ లక్షలాదిమంది మనోభావాలతో ముడిపడి ఉన్న పండుగ అని, వారి మనోభావాలు దెబ్బతినకుండా తగిన ఏర్పాట్లు చేయాలన్నారు. సిరిమానోత్సవం నిర్వహణపై అందరి అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకొని నిర్ణయించడం జరుగుతుందన్నారు. అయితే ఉత్సవాలను సంప్రదాయాలకు అనుగుణంగా, ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తామన్నారు.
ప్రస్తుత పరిస్థితుల్లో భక్తుల రాకపోకలపై నియంత్రణ తప్పదని స్పష్టం చేశారు. మనల్ని మనం కాపాడుకుందాం....అన్న నినాదంతో ముందుకు వెళ్తామని, ఉత్సవాలపై ప్రజలకు ఇప్పటినుంచే అవగాహన కల్పించే ఏర్పాట్లు చేస్తామన్నారు. ఘటాలను పూర్తిగా నిషేదించడం సరికాదని, రోజుకు రెండు మూడు వార్డుల చొప్పున, పోలీసుల ఆధ్వర్యంలో అనుమతిస్తే బాగుంటుందని సూచించారు.
దసరారోజు ఆదివారం, అమ్మవారి పండుగ రోజులైన సోమ, మంగళవారాల్లో అమ్మవారి దర్శనాలను పూర్తిగా నియంత్రించాలన్నారు. తొలేళ్లు రోజు రాత్రి జనం రాకపోకలను నియంత్రించేందుకు, ఆరోజు సాయంత్రం 7 గంటలు తరువాత, మంగళవారం పూర్తిగా పట్టణంలోని షాపులను మూసివేయాలని సూచించారు.
పులివేషాలు, విచిత్ర వేషాలను నిషేదించాలన్నారు. ఉల్లంఘించినవారిపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు. అలాగే జనం గూమిగూడే అవకాశం ఉండటంతో, సంస్కృతి ప్రదర్శనలకు సైతం అనుమతించకూడదని సూచించారు. ప్రతీవార్డుకు ఒకటినుంచి రెండు ఎల్ఇడి స్క్రీన్‌లను ఏర్పాటు చేసి, అమ్మవారి పూజలను, సిరిమానోత్సవాన్ని లైవ్ టెలికాస్ట్ చేయాలని చెప్పారు.
అదేవిధంగా ఆలయంవద్ద రద్దీని నియంత్రించేందుకు ఒకసారి అమ్మవారిని దర్శించుకొనే వారు రెండోసారి రావద్దని భక్తులను కోరాలన్నారు. సిరిమానోత్సవం రోజువరకూ వేచిఉండకుండా, శనివారం నుంచే అమ్మవారిని భక్తులు దర్శించుకొనేవిధంగా, వారిని చైతన్య పరచాలని కోరారు. భక్తుల సెంటిమెంట్ దెబ్బతినకుండా అమ్మవారి పండుగను నిర్వహించాలని, ఇదే సమయంలో కోవిడ్ వ్యాప్తిని దృష్టిలో పెట్టుకొని తగిన జాగ్రత్తలను తీసుకోవాలని సూచించారు.
ఒకటిరెండు రోజుల్లో అమ్మవారి పండుగకు సంబంధించి అందరి అభిప్రాయాలను దృష్టిలో పెట్టుకొని, తగిన విధివిధానాలను ఖరారు చేసి, ప్రజలకు వెళ్లడించాలని కలెక్టర్‌ను మంత్రి ఆదేశించారు.
ఈ సమావేశంలో విజయనగరం ఎంపి బెల్లాన చంద్రశేఖర్, వైకాపా రాజకీయ వ్యవహారాల సమన్వయకర్త మజ్జి శ్రీనివాసరావు, జాయింట్ కలెక్టర్(రెవెన్యూ) డాక్టర్ జి.సి. కిశోర్‌కుమార్, జాయింట్ కలెక్టర్ (ఆసరా) జె.వెంకటరావు, డిఆర్ఓ ఎం.గణపతిరావు, ఆర్‌డిఓ బిహెచ్ భానుప్రకాష్, పైడితల్లి ఆలయ ఇఓ సుబ్రమణ్యం, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.