బండరాళ్లు మీదపడి ఆరుగురు కూలీలు దుర్మరణం - సీఎం బాబు దిగ్భ్రాంతి

ఠాగూర్

ఆదివారం, 3 ఆగస్టు 2025 (15:30 IST)
ఏపీలోని బాపట్ల జిల్లా బల్లికురవలో ఆదివారం ఘోర ప్రమాదం జరిగింది. గ్రానైట్ క్వారీలో బండరాళ్లు మీదపడటంతో ఆరుగురు కూలీలు ప్రాణాలు కోల్పోయారు. మరో 16 మంది కూలీలు గాయపడ్డారు. వీరంతా క్వారీలో పని చేస్తుండగా ఉన్నట్టుండి బండరాళ్లు కిందపడ్డాయి. దీంతో ఆరుగురు కార్మికులు రాళ్లకిందపడి నలిగిపోయి ప్రాణాలు విడిచారు. మృతులంతా ఒరిస్సాకు చెందిన కార్మికులు కావడం గమనార్హం. ప్రమాద వార్త తెలియగానే స్థానిక పోలీసులు, జిల్లా యంత్రాంగం, సహాయక బృందాలు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. 
 
మరోవైపు, ఈ ప్రమాదంలో ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. క్వారీలో పనులు చేస్తుండగా ఒక్కసారిగా బండరాళ్లు కూలిపడటంతో ఈ విషాదం జరిగిందని ఈ ఘటనలో పలువురు ప్రాణాలు కోల్పోవడం బాధాకరమన్నారు. 
 
ఈ ఘటనపై సంబంధిత అధికారులతో మాట్లాడి, సహాయక చర్యలు వేగంగా చేపట్టాల్సిందిగా ఆదేశించారు. అలాగే, ప్రమాదానికి గల కారణాలపై కూడా ఆయన ఆరా తీశారు. గాయపడిన వారికి తక్షణమే అత్యుత్తమ వైద్య సేవలు అందించాలని జిల్లా అధికార యంత్రాన్ని ఆదేశించారు. 
 
క్షతగాత్రుల ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికపుడు పర్యవేక్షించాలని అధికారులను ఆదేశించారు. అదేసమయంలో ఈ ప్రమాదం జరగడానికి దారితీసిన పరిస్థితులపై సమగ్ర విచారణ జరిపి నివేదిక సమర్పించాలని ఆయన సూచించారు. భవిష్యత్‌లో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా కఠినమైన భద్రతా చర్యలు తీసుకోవాలని ఆయన అధికారులకు దిశానిర్దేశం చేశారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు