రైల్వే ప్రయాణికులకు అలెర్ట్ : 12 నుంచి 22 వరకు అనేక రైళ్లు రద్దు

ఠాగూర్

ఆదివారం, 10 మార్చి 2024 (12:40 IST)
రెండు తెలుగు రాష్ట్రాల్లోని రైలు ప్రయాణికులకు రైల్వే శాఖ ఒక హెచ్చరిక చేసింది. ఈ నెల 12వ తేదీ నుంచి 22వ తేదీ వరకు అనేక రైళ్లను రద్దు చేశారు. దక్షిణ మధ్య రైల్వే జారీ చేసిన ప్రకటన ప్రకారం ఈ నెల 12, 15, 16, 19 తేదీలలో కాచిగూడ, మహబూబ్ నగర్ మధ్య నడిచే ఎక్స్‌ప్రెస్ రైళ్లు షాద్ నగర్ మీదుగా వెళ్లవని అధికారులు తెలిపారు. ట్రాఫిక్ బ్లాక్ కారణంగా వాటిని వేరే మార్గంలో నడిపిస్తున్నట్టుగా వివరించారు. కొన్ని రైళ్లను తాత్కాలికంగా రద్దు చేయగా, మరికొన్ని రైళ్లను దారి మళ్లించినట్టు పేర్కొన్నారు. 
 
ఈ నెల 20వ తేదీన హౌరా - శ్రీసత్యసాయి ప్రశాంతి నిలయం మధ్య నడిచే సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్‌ను నంద్యాల, ఎర్రగుంట్ల మీదుగా నడిపిస్తున్నట్టు చెప్పారు. డోన్, గుత్తి స్టేషన్ల మధ్య తాత్కాలికంగా స్టాపును రద్దు చేశారు. ఈ నెల 22వ తేదీ నుంచి శ్రీ సత్యసాయి ప్రశాంతి నిలయం - హౌరా, పూరి - యశ్వంత్‌పూర్ మధ్య నడిచే ఎక్స్‌ప్రెస్ రైళ్లను గుత్తి పోర్టు, ఎర్రగుంట్ల, నంద్యాల మీదుగా మళ్లిస్తున్నట్టు దక్షిణ మధ్య రైల్వే విడుదల చేసిన ఓ పత్రికా ప్రకటనలో పేర్కొంది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు