జెడ్పీ ఛైర్ పర్సన్‌గా, ఎమ్మెల్యేగా, మంత్రిగా, డిప్యూటీ స్పీకర్ వంటి ఉన్నత పదవులు అధిరోహించి మహిళల అభ్యుదయాన్ని చాటి చెప్పారు. వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా ఆమె చేసిన సేవలు చిరస్మరణీయమన్నారు. గంగాధర నెల్లూరు నియోజకవర్గ అభివృద్ధిలో ఆమె ఎప్పటికీ చిరస్థాయిగా నిలిచిపోయారన్నారు. కుతూహలమ్మ మృతికి తెలుగుదేశం పార్టీ తరపున ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ.. వారి కుటుంబానికి ఆ భగవంతుడు మనో ధైర్యాన్ని కలిగించాలని కోరుకుంటున్నాం అని పేర్కొన్నారు.
మాజీ మంత్రి కుతూహలమ్మ ఇకలేరు...
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ మంత్రి, మాజీ డిప్యూటీ స్పీకర్ గుమ్మడి కుతూహలమ్మ మృతి చెందారు. తిరుపతిలోని ఆమె నివాసంలోనే బుధవారం కన్నుమూశారు. ఆమెకు వయసు 74 యేళ్లు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ వచ్చిన ఆమె.. బుధవారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు.
ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని కందుకూరులో 1949 జూన్ ఒకటో తేదీన జన్మించిన ఆమె.. వృత్తిరీత్యా ఒక వైద్యురాలు. ఎంబీబీఎస్ పూర్తి చేసిన ఆమె కొంతకాలం పాటు వైద్యవృత్తి చేశారు. అయితే, రాజకీయాల్లో ఆసక్తితో 1979లో కాంగ్రెస్ పార్టీలో చేరారు.1985లో తొలిసారి అసెంబ్లీలో అడుగుపెట్టారు. వేపంజేరి నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థిగా ఆమె పోటీ చేసి విజయం సాధించారు. వేపంజేరి నియోజకవర్గాన్ని ఆమె తన కంచుకోటగా మార్చుకున్నారు.
ఆ తర్వాత 1991లో ఉమ్మడి రాష్ట్ర వైద్యఆరోగ్య శాఖామంత్రిగా పని చేశారు. 1992-93లో మహిళా శిశు సంక్షేమ శాఖామంత్రిగా ఉన్నారు. 2007 నుంచి 2009 వరకు ఏపీ అసెంబ్లీకి ఉప సభాపతిగా ఉన్నారు. 1985 నుంచి వరుసగా ఐదు పర్యాయాలు ఎమ్మెల్యేలుగా గెలుపొందారు. అయితే 2009లో వేపంజేరి నియోజకవర్గం రద్దు కాగా, ఎస్సీ రిజర్వుడ్ స్థానమైన గంగాధర నెల్లూరు నుంచి పోటీ చేయాల్సి వచ్చింది.