ఓటుకు నోటు కేసుతో కేసీఆర్ నీచ రాజకీయాలకు తెగబడుతున్నారు..

బుధవారం, 9 మే 2018 (11:00 IST)
ఓటుకు నోటు కేసుపై తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు, సీఎం కేసీఆర్ సమీక్ష చేయడంపై ఏపీ సీఎం చంద్రబాబుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అయితే టీడీపీ నేతలు కేసీఆర్ సర్కారుపై మండిపడుతున్నారు.


ఈ క్రమంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌పై టీడీపీ ఏపీ రాష్ట్ర కాపునాడు కార్యదర్శి కంకణాల పెంచలనాయుడు విమర్శలు గుప్పించారు. ఓటుకు నోటు కేసు పేరుతో కేసీఆర్ నీచమైన రాజకీయాలకు తెగబడుతున్నారని దుయ్యబట్టారు. ఇలాంటి నీచ రాజకీయాలను మానుకోవాలని హితవు పలికారు. 
 
ఏపీ అభివృద్ధి కోసం సీఎం చంద్రబాబు తీవ్ర కృషి చేస్తుంటే.. ఆయన ప్రతిష్ఠను భంగం కలిగే రీతిలో కొందరు వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ఏపీని నాశనం చేయాలనే కుట్రలో భాగంగానే చంద్రబాబుపై ఓటుకు నోటు అభాండాలు వేస్తున్నారని ఆరోపించారు. కేసీఆర్ విజ్ఞతతో వ్యవహరించాలని తెలిపారు. లేకుంటే ఏపీ ప్రజలు చూస్తూ ఊరుకోరని హెచ్చరించారు.
 
మరోవైపు ఓటుకు నోటు కేసు సంబంధించిన ఆడియోలో వున్నది చంద్రబాబు గొంతేనని ఫోరెన్సిక్ నివేదిక తేల్చిన నేపథ్యంలో సీఎం పదవి నుంచి చంద్రబాబు మర్యాదపూర్వకంగా తప్పుకోవడం మంచిదని కాంగ్రెస్ నేత సి.రామచంద్రయ్య సూచించారు. నాలుగేళ్ల పాటు నేరాలు, ఘోరాలు చేసి... ఇప్పుడు ర్యాలీలు చేస్తారా? అని మండిపడ్డారు. కాల్ మనీ కేసులో ఎవరినైనా అరెస్ట్ చేశారా? అని ప్రశ్నించారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు