విజయవాడ: ప‌్రత్యేక హోదా ఇక ఎట్టి పరిస్థితుల్లో రాదని కేంద్రం స్పష్టం చేసిన నేపథ్యంలో ఇక సాయం తీసుకోవడం తప్ప చేసేది లేదని ఏపీ సీఎం భావిస్తున్నారు. పైగా ఈ తరుణంలో ప్రత్యేక హోదాపై ఉద్యమాలు హుష్ కాకి అని ఒక నిశ్చిత అభిప్రాయానికి వచ్చేశారు. ప్రతిపక్షాల వారు ఎవరు ఎన్ని రాజకీయాలు చేసినా, అభివృద్ధి మంత్రంతో తాము ముందుకు వెళతామని, ఈ దశలో కేంద్రంతో కొట్లాడి ప్రయోజనం ఏముంటుందని పేర్కొంటున్నారు.
ప్యాకేజీతో అభివృద్ధి చూపించి... అదే మంత్రంగా 2019 ఎన్నికల్లో ఎదురులేని శక్తిగా ఎదగాలని, తిరిగి అధికారం చేపట్టడానికి ఇదే పంథా అవలంభించాలని చంద్రబాబు భావిస్తున్నారు. అవసరం అయితే, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ను తురుపుముక్కగా ఎన్నికల సమయంలో వినియోగించుకునే అవకాశం ఎటూ ఉందని ఆయన ఆలోచనగా ఉంది. అయితే, ఇది అంతర్గత విషయమని, అయినా దీనికి ఇంకా కొంత సమయం ఉందని భావిస్తున్నారు.
కేంద్రంపై విమర్శలు వద్దు... సంయమనం పాటించండి...
స్పెషల్ కేటగిరీ స్టేటస్ పైన కేంద్రంతో పోరాడే ఉద్దేశం తమకు లేదని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. హోదాకు మించి సాయం కేంద్రం చేస్తున్నపుడు అసలు దానిని నిరాకరించాల్సిన అవసరం ఏమిటని ఆయన ప్రశ్నిస్తున్నారు. పోలవరం ప్రాజెక్టుకు 20 వేల కోట్ల రూపాయలు కేంద్రం నుంచి అందుతుందని, దీనితో 2018 కల్లా ప్రాజెక్టును పూర్తి చేసే బాధ్యతను తీసుకుంటామన్నారు. ఈ దశలో ప్రత్యేక హోదాపై గాని, ప్యాకేజీపై గాని కేంద్రంపై విమర్శలు వద్దని, టీడీపీ శ్రేణులకు, నేతలకు చంద్రబాబు హితోపదేశం చేస్తున్నారు.