తెలంగాణ బీజేపీ నేత ఏపీ ప్రత్యేక హోదాపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రత్యేక హోదా కోసం కేంద్రంపై ఏపీ రాజకీయ పార్టీలు అవిశ్వాసం పెట్టేందుకు సిద్ధమవుతున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇస్తే దేశంలో అశాంతి ఏర్పడుతుందని కిషన్‌రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఏపీకి ప్రత్యేకహోదా ఇచ్చిన క్షణమే మమతా బెనర్జీ - నితిష్ కుమార్‌లు ఎన్డీఏ నుంచి విడిపోతారని చెప్పారు.
కేంద్ర ప్రభుత్వంపై అవిశ్వాసం పెట్టే హక్కు పార్టీలకు ఉందని, తీర్మానంపై జరిగే చర్చలో అన్ని విషయాలు వివరించేందుకు ప్రధాని నరేంద్ర మోడీ సిద్ధంగా వుందని చెప్పుకొచ్చారు. ఏపీ స్పెషల్ స్టేటస్ గురించి కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని తిరుపతి సభలో ఎవరో ఇచ్చిన చీటీ చూసి అన్నారు. ప్రత్యేక హోదాపై మోదీకి అప్పట్లో సరైన అవగాహన లేదన్నారు.
ప్రస్తుతానికి ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తే దేశంలో అశాంతి నెలకొంటుంది. అందుకే స్పెషల్ ప్యాకేజీ ఇవ్వాలని కేంద్రం నిర్ణయం తీసుకుందని కిషన్ రెడ్డి తెలిపారు. ప్రకటించిన ప్రత్యేక ప్యాకేజీ ప్రకారం కేంద్రం నిధులు ఇస్తుందని, ఆందోళన అవసరం లేదని తెలిపారు. కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణ కంటే ఏపీకే ఎక్కువ నిధులు కేటాయించారని, ఏపీకి కేంద్రం అన్యాయం చేసిందనే ప్రచారంలో వాస్తవం లేదని చెప్పారు.