ఆంగ్లేయుల పాలనలో మద్రాస్ ప్రెసిడెన్సీ ప్రాంతాలలో అంటే నేటి కేరళ, తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో ఆదాయం ఉన్న హిందూ దేవాలయాలన్నీ ప్రభుత్వ అధీనంలోకి తెచ్చి దేవాదాయ ధర్మాదాయ శాఖను ఏర్పరిచారన్నారు.
దేశంలో మరే ఇతర రాష్ట్రాలలో ఈ పద్దతి లేదన్నారు. స్వాతంత్ర్యం వచ్చిన తరువాత 70ఏళ్లలో మనదేశ అవసరాలకు అనుగుణంగా అనేక మార్పులు చేసుకుంటున్నామని కానీ దక్షిణాది రాష్ట్రాలలో దేవాదాయ, ధర్మాదాయ శాఖ పేరుతో హిందూ దేవాలయాలపై ఆధిపత్యంలో మార్పు రాలేదన్నారు.
రోజు రోజుకు రాష్ట్ర ప్రభుత్వాల మితిమీరిన జోక్యం పెత్తనం దేవాదాయ, ధర్మాదాయ శాఖపై పెరిగిందన్నారు. దేవాలయాల ఆదాయాన్ని ధార్మిక ఇతర కార్యక్రమాలకు ఇతర ఖర్చులకు మళ్లిస్తున్నారన్నారు. దేవాదాయ శాఖలో హైందవేతర ఉద్యోగస్తులను నియమించడం పట్ల ఎన్నిసార్లు విజ్ఞప్తులు చేసినా వారిని తొలగించడం లేదన్నారు.
రాష్ట్రంలో దేవాలయాలపై దాడులు, స్వామి మూర్తుల విశ్వాసం, నిమ్మకు నీరెత్తినట్లు ఉన్న దేవాదాయ శాఖ, కేవలం ఒక రాజకీయ నాయకుని వలే వ్యవహరిస్తున్న నేటి దేవాదాయశాఖా మంత్రి అన్ని విధాలా బాధ్యతలను విస్మరించారన్నారు.