కదిరి పట్టణంలో వేకువజామునే దొంగలు బీభత్సం సృష్టించారు. ఉదయం రెండు ఇళ్లల్లోకి చొరబడి ఇద్దరు మహిళల ఒంటిపై ఉన్న బంగారు ఆభరణాలను దోచుకున్నారు. అనంతరం ఓ మహిళ ఉపాధ్యాయురాలును హత్య చేశారు. మరో మహిళపై దాడి చేశారు.
వివరాల్లోకి వెళితే.. కదిరి పట్టణం ఎన్జీవో కాలనీలో నివాసముండే శంకర్ రెడ్డి ఉష దంపతులు భర్త ఉదయం వాకింగ్ కోసం వెళ్లిన సమయంలో చోరీకి వచ్చిన దుండగులు ఉషా(45 )పై దాడికి పాల్పడ్డారు. తీవ్ర గాయాలపాలైన ఆమె అక్కడికక్కడే మృతి చెందింది.
అనంతరం పక్కన ఉండే ఇంటికి ప్రవేశించిన దుండగులు శివమ్మ అనే మహిళ పై దాడి చేసి ఆమె మెడలోని బంగారాన్ని దోచుకున్నారు. దొంగలను రాకను గుర్తించి బయటికి రాబోయిన శివమ్మ కుమారుడు కోడలిని గదిలోనే బంధించారు. దాడిలో శివమ్మకు తీవ్ర గాయాలయ్యాయి.
ఉదయం పని నిమిత్తం ఇంట్లోకి వచ్చిన పని మనిషి చూసి శివమ్మ కుమారుడు కోడలు ఉన్న గది తెరిచింది. అనంతరం బయటకు వచ్చిన వారు శివమ్మను వైద్యం నిమిత్తం బెంగళూరు ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.