ఉమ్మడి రాజధానిపై తమ పార్టీ సీనియర్ నేత, పార్టీ ప్రధాన కార్యదర్శి వైవీ సుబ్బారెడ్డి చేసిన వ్యాఖ్యలను మీడియా వక్రీకరించిందని ఏపీ విద్యామంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. ఉమ్మడి రాజధాని అనేది తమ ప్రభుత్వ విధానం కాదన్నారు. తమ విధానం.. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలు సమానంగా వృద్ధి చెందేలా మూడు రాజధానులను నిర్మించడమేనని తెలిపారు. ఉమ్మడి రాజధాని అంశంపై జరుగుతున్న చర్చపై ఆయన స్పందించారు.
అనుభవం ఉన్న నేత ఎవరైనా అలాంటి వ్యాఖ్యలు చేయరని, వైసీపీ నాయకుడు వైవీ సుబ్బారెడ్డి వ్యాఖ్యలను మీడియానే వక్రీకరించిందని అన్నారు. హైదరాబాద్‌ను ఉమ్మడి రాజధానిగా కొనసాగించాలన్నది తమ ప్రభుత్వ విధానం కాదన్నారు. హైదరాబాద్ విశ్వనగరం. అక్కడ ఎవరికైనా ఆస్తులు ఉండవచ్చు. అక్కడ నాకు కూడా ఇల్లు ఉంది. నేను ఏపీ మంత్రిని కాబట్టి ఆ ఇంటిని అక్కడి ప్రభుత్వం కబ్జా చేస్తుందా అని ప్రశ్నించారు.
విశాఖ పరిపాలనా రాజధాని గురించి విలేకరులు ప్రస్తావించగా.. తాము సిద్ధంగా ఉన్నా, కొంత మంది రాక్షసులు తమ యజ్ఞాన్ని భగ్నం చేస్తున్నారని మండిపడ్డారు. బీజేపీతో పొత్తు కోసం చంద్రబాబు ఢిల్లీ వెళ్లారని, వచ్చే ఎన్నికల్లో ఎన్ని పార్టీలు కలిసి వచ్చినా తమది మాత్రం ఒంటరిగా వెళ్లి విజయం సాధించి మళ్లీ అధికారంలోకి వస్తామన్నారు.
'రాష్ట్రంలో ఉద్యోగులు ఎందుకు ఆందోళన చేస్తున్నారో తనకు అర్థం కావడం లేదన్నారు. వారి సమస్యలపై ఇప్పటికే పలుమార్లు చర్చలు జరిపాం. పీఎఫ్ సహా అన్ని బకాయిలను ఒకటి రెండు నెలల్లో తీర్చేస్తామని చెప్పినప్పటికీ ఆందోళన చేయడం ఆశ్చర్యంగా ఉంది. పాఠశాలల్లో ఉపాధ్యాయ ఖాళీలు లేకుండా ఇకపై ఏటా డీఎస్సీ నిర్వహిస్తాం. టెట్‌ను వాయిదా వేయాలని ఇప్పుడు కోరడం సమంజసం కాదు. వారి డిమాండ్ మేరకే టెట్ పరీక్షను నిర్వహిస్తున్నామని తెలిపారు.