తిరుపతి పార్లమెంటు నియోజకవర్గంలో చిత్తూరు, నెల్లూరు జిల్లా పరిధిలో పర్యాటక ప్రదేశాలను అభివృద్ధి చేసేందుకు సంబంధిత ప్రభుత్వ శాఖలు అన్ని కృషి చేయాలని తిరుపతి ఎం పి మద్దిల గురుమూర్తి పిలుపునిచ్చారు. ఎం పి శనివారం చిత్తూరు, నెల్లూరు జిల్లాలో పర్యాటక రంగం అభివృద్ధి కి ఉన్న అవకాశాలను అధికారుల తో సమీక్షించారు. ఎక్కడెక్కడ పర్యాటక శాఖ అధికారులు, ఇతర ప్రభుత్వ శాఖల అధికారుల కు మధ్య సమన్వయ లోపం ఉందో అక్కడ అధికారులు ఆ లోపం అధిగమించి పర్యాటక ప్రదేశాల అభివృద్ధి కి పనిచేయాలన్నారు.
అన్ని ప్రభుత్వ శాఖల అధికారులు, ప్రైవేట్ టూరిజం ఆపరేటర్స్, హోటల్ యజమానులు అందరూ ఒకరినొకరు సహకరించుకుని ముందుకు సాగాలని ఎం పి గురుమూర్తి సూచించారు. అదేవిధంగా లీడింగ్ టూరిజం కంపెనీలు, ఇండియా టూరిజం ఆఫీసు లు తిరుపతి లో పెట్టించటానికి కృషి చేస్తామన్నారు. భవిష్యత్ లో దేశంలోనే అత్యధిక పర్యాటక ఆదాయం ఆర్జించే విధంగా తిరుపతి పార్లమెంటు పరిధిలో ని పర్యాటక ఆకర్షణలు అభివృద్ధి చేయాలన్నారు. తిరుమలకు విచ్చేసే పర్యాటకులకు నెల్లూరు, చిత్తూరు లలో బీచ్, ఆధ్యాత్మిక, ఏకో పర్యాటక ప్రదేశాలు చూసేలా ప్యాకేజీ లను రూపొందించాలన్నారు.
అలాగే పర్యాటక ప్రాంతాల్లో మరుగుదొడ్లు, వాహనాలు పార్కింగ్, మంచినీటి సౌకర్యం ఉండేలా సౌకర్యాలు కల్పించాలని, నిర్వహణ పరిశుభ్రంగా ఉండాలన్నారు. ఈ నెల 29 వ తేదీ లోపు పర్యాటక అభివృద్ధి కి కేంద్ర ప్రభుత్వం నుంచి ఏఏ అనుమతులు, నిధులు అవసరం అనేది నిర్దిష్టమైన ప్రతిపాదనలు సమర్పించాలని పర్యాటక , ఆర్కియాలజీ ఇతర శాఖల అధికారులకు సూచించారు.
ఈ సమీక్ష సమావేశంలో చిత్తూరు జిల్లా ఆసరా జాయింట్ కలెక్టర్ రాజశేఖర్, డిఎఫ్ఓ వైల్డ్ లైఫ్ పవనకుమార్, శ్రీకాళహస్తి ఆలయ ఈఓ, నెల్లూరు, చిత్తూరు జిల్లాల పర్యాటక శాఖల అధికారులు, ఆర్కియాలజీ, ఫారెస్ట్, రహదారులు భవనాలు, దేవాదాయ శాఖ అధికారులు పాల్గొన్నారు.