తిరుపతిలో కాషాయం జెండా ఎగురవేయాల్సిందే : బీజేపీ హైకమాండ్

సోమవారం, 18 జనవరి 2021 (16:31 IST)
తిరుపతి సిట్టింగ్ ఎంపీ అకాల మరణంతో లోక్‌సభ ఉప ఎన్నికలు త్వరలో జరుగనున్నాయి. ఈ ఎన్నికల్లో పోటీ చేయాలని బీజేపీ ఉవ్విళ్లూరుతోంది. ఈ ఎన్నికల్లో ఖచ్చితంగా విజయం సాధించి తీరాలన్న పట్టుదలతో ఆ పార్టీ నేతలతో పాటు.. శ్రేణులు ఉన్నాయి. 
 
ఈ క్రమంలో విశాఖ శివారు రుషికొండలో జాతీయ ప్రధాన కార్యదర్శి దగ్గుబాటి పురందేశ్వరి ఇంట్లో ఆదివారం మధ్యాహ్నం కోర్‌ కమిటీ సమావేశం నిర్వహించారు. కేంద్ర మంత్రి మురళీధరన్‌, ఎంపీ జీవీఎల్‌ నరసింహారావు, రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు, ఎమ్మెల్సీ మాధవ్‌, మాజీ ఎంపీ కంభంపాటి హరిబాబు, సునీల్‌ దేవధర్‌, మరో జాతీయ ప్రధాన కార్యదర్శి సత్య, తదితరులు చర్చల్లో పాల్గొన్నారు.
 
ఇందులో బీజేపీ నేతలు మాట్లాడుతూ, 'తిరుపతి పార్లమెంటు స్థానానికి జరగనున్న ఉప ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ బీజేపీ అభ్యర్థి గెలవాలి. ఇందుకోసం పార్టీ శ్రేణులన్నీ అక్కడ పనిచేయాలి' అంటూ దిశా నిర్దేశం చేశారు. 'తిరుపతి ఎన్నికల్లో ప్రతి మండలానికి ఒక బృందం పనిచేయాలి. కీలక వ్యక్తులకు నాయకత్వ బాధ్యతలు అప్పగించాలి. ఎన్నికలు పూర్తయ్యేవరకు అంతా అక్కడే ఉండాలి' అంటూ ఆదేశించారు. 
 
వచ్చే నెలలో తిరుపతిలోని కపిల తీర్థం నుంచి విజయనగరం జిల్లా రామతీర్థం వరకు రథయాత్ర  చేపట్టాలని, దీనికి ప్రతి నియోజకవర్గం నుంచి జనసమీకరణ జరగాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అనేక ప్రజా వ్యతిరేక విధానాలను అవలంభిస్తోందని, ప్రకటించిన ఏ పథకాన్ని సజావుగా అమలు చేయడం లేదని, ప్రకటనలతో భ్రమింపజేస్తోందన్న అంశాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని నిర్ణయించారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు