తిరుపతి టిక్ టాక్ స్టార్ మహిళ వీడియోలను నీలిచిత్రాలుగా మార్చి షేర్ చేశారు

గురువారం, 19 ఆగస్టు 2021 (23:10 IST)
టిక్ టాక్ చేయడం ఆమెకు హాబీగా మారింది. పెళ్ళయ్యింది. ఖాళీ సమయాల్లో టిక్ టాక్ వీడియోలు చేస్తూ వాటిని పోస్ట్ చేస్తూ ఉండేది. అది కాస్త బాగా వైరల్ అయ్యింది. ఆ మహిళకు మంచి పేరు వచ్చింది. ఇంకేముంది ఆమె వీడియోలను మార్ఫింగ్ చేసి డబ్బులు సంపాదించాలనుకున్నారు కేటుగాళ్ళు. అనుకున్నదే తడువుగా ఒక ముఠాగా ఏర్పడి ఆ వీడియోలను మార్ఫింగ్ చేయడం మొదలుపెట్టారు. 
 
తిరుపతికి చెందిన ఒక మహిళ టిక్ టాక్ వీడియోలను చేస్తూ ఉంది. గత సంవత్సరంగా చేస్తున్న వీడియోలను స్నేహితులు బాగా ఆదరించేవారు. అయితే సుళువుగా డబ్బులు సంపాదించాలనుకున్న కొంతమంది యువకులు ఒక ముఠాగా ఏర్పడ్డారు. ఆమె పోస్ట్ చేసిన వీడియోలను మార్ఫింగ్ చేసి బ్లూఫిల్మ్ మాదిరిగా మార్చారు. 
 
ఎంతో అసభ్యంగా చూపిస్తూ ఆ వీడియోలను పోస్టులు చేశారు. అలా ఒక సైట్ ఓపెన్ చేసి డబ్బులు సంపాదించడం మొదలుపెట్టారు. పదే పది రోజుల్లో ఆ ముఠాకు లక్షా 30 వేల రూపాయలు వచ్చింది. ఇంకా సంపాదించుకోవచ్చునని మరికొన్ని వీడియోలను చేశారు. దీంతో అసలు విషయం ఆ మహిళకు తెలిసిపోయింది.
 
వెంటనే తిరుపతి సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఆ నిందితులను కనుగొనే ప్రయత్నం చేశారు. తెలంగాణా రాష్ట్రంలో ముగ్గురు యువకులు, తిరుపతికి చెందిన ముగ్గురు యువకులను గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. 
 
మహిళలను లక్ష్యంగా చేసుకుని నేరాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని తిరుపతి అర్బన్ జిల్లా ఎస్పీ వెంకట అప్పలనాయుడు హెచ్చరించారు. సోషల్ మీడియాలో ఫోటోలు, వీడియోలు పోస్ట్ చేసేటప్పుడు జాగ్రత్త వహించాలన్నారు. సైబర్ నేరాల్లో బాధిత మహిళలు నిస్సంకోచంగా ఫిర్యాదు చేయవచ్చునన్నారు. సుళువుగా డబ్బులు సంపాదించవచ్చునని ఫేక్ వెబ్ సైట్ లింక్‌లను ఓపెన్ చేసి మోసపోవద్దని ఎస్పీ విజ్ఙప్తి చేశారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు