తెలుగు హీరో శివాజీ చాలాకాలం తర్వాత మళ్లీ వార్తల్లోకి వచ్చారు. మనమంతా చాలా కలుషితమైపోయినట్టు చెప్పారు. ముఖ్యంగా, ఏపీ అంటేనే కులాల కుంపటిగా మారిందన్నారు. అలాగే, దేశ పారిశ్రామికవేత్త ముకేష్ అంబానీ కూడా దేశం విడిచి వెళ్లాలని భావిస్తున్నారని అన్నారు.
ఇదే అంశంపై ఆయన గురువారం మాట్లాడుతూ, దేశ రాజకీయ వ్యవస్థ బాగా భ్రష్టుపట్టిపోయిందన్నారు. వీటిని భరించలేకే అంబానీ వంటివారు కూడా దేశం విడిచి ఇతర దేశాలకు వెళ్లిపోవాలని భావిస్తున్నారన్నారు. అదేసమయంలో నవ్యాంధ్ర రాజధాని అమరావతిని ఏదో చేద్దామని అనుకుంటే అది భ్రమే అవుతుందన్నారు. అమరావతిని ఎవరూ ఏమి చేయలేరనీ, ఏపీకి అమరావతే రాజధానిగా ఉంటుందని శివాజీ జోస్యం చెప్పారు.
ఏపీ మంత్రులుగా ఉన్న పలువురు మాట్లాడే పిల్లి కూతలను ఏమాత్రం పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు. రాజకీయాల్లో ఏ ఒక్కరూ శాశ్వతంకాదన్నారు. అదేసమయంలో రాష్ట్రానికి జరిగే అన్యాయాన్ని ఏ ఒక్కరూ పట్టంచుకోవడం లేదని వాపోయారు. అలాగే, సినిమా వచ్చే సన్నివేశాలను గుర్తుపెట్టుకున్నంత సులభంగా సమాజంలో జరిగే విషయాలను ప్రజలు గుర్తుపెట్టుకోవడం లేదని వాపోయారు.