కలియుగందైవం శ్రీ వేంకటేశ్వర స్వామి కొలువైవున్న తిరుమల కొండపై రద్దీ విపరితంగా ఉందని అందువల్ల వీఐపీ, భక్తులు తమ ప్రయాణాలను వాయిదా వేసుకోవాలని ఈవో ధర్మారెడ్డి పిలుపునిచ్చారు. ప్రస్తుతం సర్వదర్శనానికి 48 గంటల సమయం పడుతుందని వీఐపీలు శ్రీవారి దర్శనం కోసం వచ్చే సాధారణ భక్తులకు తీవ్ర అసౌకర్యం కలిగే అవకాశం ఉన్నందున వీఐపీలతో పాటు భక్తులు కూడా తమ ప్రయాణాన్ని వాయిదా వేసుకోవాలని ఆయన కోరారు.
కాగా, శనివారం సాయంత్రానికే తిరుమలకు రికార్డు స్థాయిలో భక్తులు చేరుకున్నారు. సర్వదర్శనం క్యూ కాంప్లెక్స్‌లలోని కంపార్టుమెంట్లన్నీ నిండిపోయాయి. ఫలితంగా సర్వదర్శనం భక్తులకు స్వామి వారి దర్శనానికి ఏకంగా 48 గంటల సమయం పడుతుందని తితిదే తెలిపింది.
ప్రస్తుతం తిరుమల కొండపై నెలకొన్న పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని ఈవో ధర్మారెడ్డి శనివారం రాత్రి ఓ విజ్ఞప్తి చేశారు. తిరుమలలో ప్రస్తుతం ఉన్న రద్దీ తగ్గేందుకు కనీసం 2 రోజుల సమయం పడుతుందని, ఆ మేరకు తిరుమల పర్యటనను కొద్ది రోజుల పాటు వాయిదా వేసుకోవాలని ఆయన కోరారు.
ఇప్పటికే తిరుమలకు చేరుకున్న భక్తులకు అన్ని రకాల సౌకర్యాలను అందించేందుకు సిద్ధంగా ఉన్నామని, మరింత మంది పెరిగితే అందుకనుగుణంగా ఏర్పాట్లు చేసేందుకు టీటీడీకి ఇబ్బందిగా మారుతుందని ఆయన చెప్పుకొచ్చారు. భారీ రద్దీతో భక్తులకు అసౌకర్యం కలిగే ప్రమాదం ఉందని చెప్పిన ఆయన.. అదే జరిగితే తగినంత ఏర్పాట్లు చేయలేదంటూ టీటీడీపై నిందలేస్తారని తెలిపారు.