ప్రజా సమస్యలపై రాజీలేని పోరాటం: చంద్రబాబు

మంగళవారం, 20 అక్టోబరు 2020 (17:40 IST)
ప్రజా సమస్యలపై రాజీలేని పోరాటం చేయాలని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. 175నియోజకవర్గాల టిడిపి బాధ్యులు, ప్రజాప్రతినిధులు పోలిట్ బ్యూరో, కేంద్ర కమిటీల సభ్యులతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ఏమన్నారంటే...?!
 
‘‘కొత్త బాధ్యతలను మరింత చురుగ్గా నిర్వర్తించాలి. ప్రజా సమస్యలపై రాజీలేని పోరాటం చేయాలి. పార్టీ శ్రేణులను, కార్యకర్తలను సమన్వయం చేయాలి. వైసిపి బాధిత ప్రజానీకానికి టిడిపి కమిటీలు అండగా ఉండాలి.
ఇవి పదవులు కాదు, బాధ్యతలుగా గుర్తుంచుకోవాలి. ప్రజల పట్ల మీ బాధ్యతలను సమర్ధంగా నిర్వహించాలి. 

ఈ రోజు మనం చేసుకునే సంస్థాగత నిర్మాణంతో టిడిపి మరో 30ఏళ్లు ప్రజాదరణ పొందాలి.
టిడిపి పోలిట్ బ్యూరోలో 60% బడుగు బలహీన వర్గాలకే..40% బిసిలకే టిడిపి పోలిట్ బ్యూరోలో సభ్యత్వం.
గతంలో కొన్ని కుటుంబాలకే పరిమితమైన రాజకీయం.. టిడిపి వచ్చాకే బడుగు బలహీన వర్గాలకు రాజ్యాధికారం. సామాజికంగా, ఆర్ధికంగా, రాజకీయంగా గుర్తింపు. 

వరద బాధితులను ముఖ్యమంత్రి జగన్, వైసిపి మంత్రులు పట్టించుకోలేదు. బాధ్యతాయుతమైన ప్రతిపక్షంగా టిడిపి నాయకులు వరద బాధితులకు అండగా ఉన్నారు. విపత్తు బాధితులను ఎలా ఆదుకోవాలో టిడిపి ప్రభుత్వం చేసిచూపింది. హుద్ హుద్, తిత్లి బాధితులను టిడిపి ప్రభుత్వం ఎలా ఆదుకుంది..? ఇప్పుడీ వరదలు, భారీవర్షాల బాధితులపై వైసిపి నిర్లక్ష్యాన్ని ప్రజలే ప్రశ్నిస్తున్నారు. 
 
గాల్లో ప్రదక్షిణ చేసి చేతులు దులుపుకున్న జగన్మోహన్ రెడ్డి. ఎక్కడికెళ్లినా మంత్రులను చుట్టుముట్టి నిలదీస్తున్న బాధిత ప్రజానీకం.విపత్తుల్లో వైసిపి ప్రభుత్వం చేతులెత్తేసింది. రూ 500 ఇచ్చి చేతులు దులుపుకుంటోంది. ‘‘ఇల్లు వారం రోజులు మునిగితేనే’’ నిత్యావసరాలు ఇస్తామని అనడం కన్నా దుర్మార్గం ఇంకోటి లేదు.
 
ఇన్నిరోజులు మునిగితేనే సాయం చేస్తామన్న ప్రభుత్వాన్ని ఇప్పుడే చూస్తున్నాం. ముంపు నష్టానికి, ప్రభుత్వ సాయానికి తూకం వేయడం దారుణం. ఏడాదిన్నరగా వరుస వరద విపత్తులతో పంటలు దెబ్బతిని రైతులకు తీవ్రనష్టం. జీవనోపాధి కోల్పోయి చేతివృత్తులవారిలో నైరాశ్యం. 
 
టిడిపి అధికారంలోకి వస్తే ఈ పాటికి పోలవరం పూర్తయ్యేది. మరో 10-15ప్రాజెక్టుల నిర్మాణం పూర్తి చేసేవాళ్లం. 
పోలవరం పనులు ఎందుకని రద్దు చేశారు..? వాటిని రద్దు చేయకపోతే ఈ పాటికి పూర్తయ్యేది..రాయలసీమ జిల్లాలకు, దుర్భిక్ష ప్రాంతాలకు నీరు ఇచ్చేవాళ్లం. దీనిపై ప్రజలను చైతన్యపర్చాల్సిన బాధ్యత టిడిపి నాయకులదే.
 
కరోనా నియంత్రణలో విఫలం, వరద నీటి నిర్వహణలో విఫలం, బాధితులకు సహాయ చర్యల్లో విఫలం, రైతులను ఆదుకోవడంలో విఫలం, చేతివృత్తులవారికి అండగా ఉండటంలో విఫలం..‘‘ఇంత విఫల ముఖ్యమంత్రిని రాష్ట్ర చరిత్రలో చూడలేదు. 

దుర్మార్గుల పాలనలో మంచివాళ్లకు అన్నీ ఇబ్బందులే.. రాష్ట్రంలో దళితులు, గిరిజనులు, ముస్లిం మైనారిటీల భద్రత ప్రశ్నార్ధకంగా మారింది. బలహీన వర్గాలపై ఈవిధంగా దాడులు, దౌర్జన్యాలు రాష్ట్ర చరిత్రలో చూడలేదు. 
6, 7 ఏళ్ల ఆడబిడ్డలపై అత్యాచారాలు అమానుషం. రంపచోడవరంలో, పూతలపట్టులో, విజయవాడలో ఆడబిడ్డలపై కిరాతక చర్యలను ఖండిస్తున్నాం. 

చివరికి అంబేద్కర్ విగ్రహాలను కూడా వదలకుండా ధ్వంసం చేస్తున్నారు. దేవుళ్ల విగ్రహాలు, మహనీయుల విగ్రహాలను ధ్వంసం చేస్తున్నా వైసిపి చోద్యం చూస్తోంది. తూర్పుగోదావరి జిల్లా రాజోలులో అంబేద్కర్ విగ్రహాన్ని ధ్వంసం చేయడాన్ని ఖండిస్తున్నాం.
 
రాష్ట్రంలో వైసిపి ఇసుకాసురుల ఆగడాలు పేట్రేగాయి. అటు ఇసుక దొరక్క, ఇటు పనులు కోల్పోయి, భవన నిర్మాణ కార్మికుల ఆత్మహత్యలు. అయినా జగన్మోహన్ రెడ్డిలో మార్పు లేదు. రాజధాని శంకుస్థాపన జరిపి 5ఏళ్లు అయ్యింది, అమరావతి పరిరక్షణ ఉద్యమం ప్రారంభమై 300రోజులు దాటింది, మరో 50రోజుల్లో ఏడాది అవుతోంది. రైతులు,మహిళలు, రైతుకూలీల ఉసురు తీస్తున్నారు. 
 
ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎంత పోరాడితే ప్రజల్లో అంత ఆదరణ పెరుగుతుంది. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ప్రతి నాయకుడు ప్రజల్లో ఆదరణ పొందాలి. భేషజాలకు పోవడం నాయకత్వ లక్షణం కాదు, ప్రజాసేవలో భేషజాలకు తావులేదు. అందరితో సమన్వయం చేసుకోవాలి, రెట్టింపు స్ఫూర్తితో ముందుకు సాగాలి.
 
మనం చేసిన మంచిపనులు ఇప్పుడు గుర్తొస్తాయి. వైసిపి చెడ్డపనులతో, టిడిపి మంచి పనులను బేరీజు వేస్తున్నారు.
టిడిపి ప్రభుత్వం మరో 5ఏళ్లు ఉంటే రాష్ట్రంలో అభివృద్ది పనులన్నీ ఒక కొలిక్కివచ్చేవి. రాజధాని అమరావతి, పోలవరం నిర్మాణం, ఇతర ప్రాజెక్టుల పనులన్నీ చాలావరకు పూర్తయ్యేవి. 

నిర్మాణాలన్నీ సగంలో ఉండగా ప్రభుత్వం మారడం పనులన్నింటికీ ప్రతిబంధకం అయ్యింది. ఒక పార్టీపై అక్కసుతో, పనులను నిలిపేసిన ప్రభుత్వాన్ని ఇంతవరకు చూడలేదు.వరదల్లో మునిగిపోయిన ఇళ్లస్థలాలను టిడిపి నాయకులు సందర్శించాలి. భూసేకరణలో వైసిపి అవినీతిని బట్టబయలు చేయాలి. బిసి,ఎస్సీ,ఎస్టీ మైనారిటిలపై దాడులు-దౌర్జన్యాలను నిరసించాలి. వైసిపి బాధిత ప్రజలకు అండగా ఉండాలి. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు