పప్పు తినడం తప్ప, కందిపప్పు ఎలా వస్తాయో తెలుసా?... హమ్మ! సజ్జల లోకేశ్ ని ఎంత మాట అనేశాడు?

మంగళవారం, 13 అక్టోబరు 2020 (07:55 IST)
అమరావతిలో ఇన్ సైడర్ ట్రేడింగ్ జరగలేదంటే.. సీఎస్, డీజీపీలకు లేఖలు రాసే బదులు సీబీఐ విచారణకోసం ప్రధానికి లేఖ రాయొచ్చుగా బాబూ అని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి  ప్రశ్నించారు.
 
ఏ తప్పూ చేయలేదు కాబట్టే, సీబీఐ విచారణలు వేయండి అంటున్నాం.. తప్పు చేశారు కాబట్టే బాబు అండ్ కో భయపడుతున్నారు అని ఎద్దేవా చేశారు.  పప్పు తినటం తప్పితే.. కందిపప్పు ఎలా వస్తాయో తెలియని లోకేష్ రైతునని మాట్లాడటం హాస్యాస్పదం అని పేర్కొన్నారు. ఇంకా సజ్జల ఏమన్నారంటే..
 
1. టీడీపీ నాయకులు, కార్యకర్తలు అమరావతి ఉద్యమం పేరుతో చేస్తున్న కార్యక్రమం ఎలా ఉందంటే బాగా డబ్బున్న ప్రొడ్యూసర్‌ కొడుకునే హీరోగా పెట్టి ఒక చెత్త సినిమా తీసి ఏ థియేటర్లో ఒప్పుకోకపోతే, తానే ఒక థియేటర్‌ అద్దెకు తీసుకుని ప్రపంచ రికార్డులు బద్దలు చేయాలనో, లేక గిన్నిస్‌బుక్‌లోకి ఎక్కాలన్న ఉద్దేశంతో.. వాళ్ళకు వాళ్ళే వంద రోజుల సెలబ్రేషన్స్ చేసుకున్న విధంగా కనిపిస్తుంది. 
 
2.  ఇది ఒక బినామీ ఫ్లాప్ షో..
దీనిని అమరావతి ఉద్యమం అంటే ఉద్యమం అన్న మాటకే అవమానం. ఉద్యమాలు అంటే ప్రజల మద్దతుతో, ప్రజల నుంచి పుట్టి ఉత్తేజభరితంగా ఉంటాయి కానీ, తెలుగు సీరియల్స్‌లో ఉన్నట్లు కొత్త కండువాలు, కొత్త శాలువాలు వేసుకున్నట్లు ఉండవు, ఒక షో కోసం వచ్చినట్లు,  ఆర్టిస్ట్‌లు చేసే విన్యాసాలు మాదిరిగా ఉండవు. అయితే వీరిలో కొంతమంది అమాయకులు ఉండవచ్చు,  వారిని మేం అవమానించడం లేదు. 

-నిజాలు బయటకు వస్తుంటే.. చంద్రబాబు కుటుంబంలో కంగారు ఎక్కువైంది. ఈ స్కాంలో ఎంతెంత పెద్ద స్థాయిలో వ్యక్తులు ఇన్ సైడర్ ట్రేడింగ్ లో భాగస్వాములో అర్థమవుతోంది. వారందర్నీ అడ్డం పెట్టుకొని బయటపడవచ్చు అన్నది ఆరోజే చంద్రబాబు వ్యూహం అని అర్థమవుతోంది. పెద్ద పదవుల్లో ఉన్న వ్యక్తులందర్నీ కలుపుకుని తప్పు చేస్తే.. అందరూ కలిసి బయటపడవచ్చు అన్న చంద్రబాబు వ్యూహం ఇటీవల పరిణామాలతో బట్టబయలైంది. 

-అమరావతిలో ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ జరిగిందనే కదా కోర్టులలో కేసులు నడుస్తున్నాయి, క్యాబినెట్‌ సబ్‌కమిటీ రిపోర్ట్‌లు, సీబీఐకి సీఎంగారు వ్యక్తిగతంగా లేఖ రాయడం, ఇప్పుడు సుప్రింకోర్టులో ఎస్‌ఎల్‌పి దాఖలు చేశాం, సీఎం జగన్‌ సుప్రింకోర్టు ఛీప్‌ జస్టిస్‌గారికి రాసిన లేఖలో కూడా క్లియర్‌గా పేర్కొన్నారు. ఇవన్నీ లోకేష్‌కు తెలీదా..

-ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ జరగలేదంటే మార్చిలో సీఎంగారు సీబీఐకి లేఖ రాసిన వెంటనే, చంద్రబాబు డీజీపీకి, సీఎస్‌కు లేఖ రాసే బదులు ప్రధాని మోదీకి లేఖ రాసి మేం రెడీగా ఉన్నామంటే సరిపోయేది కదా, లేదా తన బినామీలతో కోర్టులలో కేసులు వేయించకుండా ఉంటే ఈపాటికి సీబీఐ ఎంక్వైరీ కూడా అయిపోయేది. మీరు అనుకుంటున్నట్లు ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ జరగకపోతే మీరు కడిగిన ముత్యంలా బయటికి వచ్చేవారు కదా.
 
3. అమరావతి ఉద్యమమే అయితే.. రైతులకు నిజంగా అన్యాయం జరిగినట్లయితే, మీరంతా ముందుండి ఎందుకు పోరాటం చేయలేదు..?టీడీపీ నాయకులు ఎందుకు రావడం లేదు, పార్టీ అధ్యక్షుడు ఎందుకు రాలేదు, కొడుకునే ఎందుకు పంపారు, ఆయన కూడా చుట్టపుచూపులాగా ఎందుకు వచ్చారు...?

- 300 రోజుల ఫ్లాప్ షోను నడిపి తండ్రీకొడుకులు ఏదేదో మాట్లాడే బదులు, రాజధాని భూముల ఇన్ సైడర్ ట్రేడింగ్ మీద సీబీఐ విచారణ కోరుతూ.. వారే ఎందుకు పిటీషన్ వేయలేదు. ఏ తప్పూ చేయలేదు కాబట్టే, జగన్ గారు, ఆయన ప్రభుత్వం ఎటువంటి విచారణకైనా సిద్ధపడుతుంటే.. మరోవైపు టీడీపీ మాత్రం తన వంతు వచ్చేసరికి సీబీఐ విచారణ నుంచి పారిపోతూ వీధి నాటకాలు బాగా ఆడుతోందని ప్రజలకు అర్థమవుతోంది. 

-ఈరోజు 29 గ్రామాలు కాస్తా.. 3 గ్రామాలయ్యాయి. 3 గ్రామాల కాస్తా.. 30 మందికి పరిమితమయ్యాయి.  ఆ 30 మంది రైతులా.. లేక బాబు మద్దతుదారులా.. అన్నది అందరికీ తెలుసు. 
 
4. ఈరోజున అటు శ్రీకాకుళం నుంచి ఇటు చిత్తూరు వరకు చంద్రబాబు మాట విని రాష్ట్రంలో 0.001 శాతం కాదుగదా.. అందులో వెయ్యో వంతు కూడా ఆందోళన చేసింది లేదు. అంటే 300 రోజుల తర్వాత రాష్ట్ర ప్రజలంతా బాబు అమరావతి కథల్ని వినడానికి సిద్ధంగా లేరని నిరూపించటానికి మాత్రమే ఈ కెమెరా డ్రామా ఉపయోగపడుతుంది. అమరావతి లోకేష్ గారి తండ్రి సొత్తేం కాదు. అది వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుచుకున్న ప్రాంతం. ఇక్కడ అభివృద్ధిగానీ, మూడు ప్రాంతాల అభివృద్ధిగానీ మా అజెండాలో భాగం. 

- కందులు ఎలా పండుతాయో తెలీదు గానీ, పప్పు చేసిన తర్వాత మాత్రం తిని ఎంజాయ్‌ చేసే చంద్రబాబు కుమారుడు, మనకు తిండి పెట్టే  రైతును కలుపుకుంటూ మనం రైతులం అని మాట్లాడుతున్నాడు. లోకేష్ ఏ రోజు పంట పండిచారో కూడా ఎవరికీ తెలీదు, కందిపప్పు అయినా తెలుసా, లేక వండిన పప్పు మాత్రమే తెలుసా..? అటువంటి లోకేష్ రైతుల గురించి మాట్లాడడం, రైతుల ఉసురు తగులుతుంది అనడం చూస్తే విడ్డూరంగా ఉంది.
 
5. అమరావతి అన్నది రాష్ట్రంలో 5 కోట్ల మంది సమస్య అని చంద్రబాబు, టీడీపీ నేతలు అంటున్నారు. రాష్ట్రమంతా కలిసి పోరాడాలని, ఇది చారిత్రక అవసరం అని చంద్రబాబు ట్వీట్‌ లు పెట్టారు. బిజేపీని దించడం చారిత్రక అవసరం అని మొన్నటి ఎన్నికల ముందు వరకూ అన్నారు, చంద్రబాబుకు ఇష్టమైన పదం చారిత్రక అవసరం. అది తనకు నచ్చినట్లు, నచ్చినప్పుడు అది చారిత్రక అవసరంగా రూపాంతరం చెందుతుంది.  నిజంగా ఈ మాట అనడానికి ఆయన మనస్సాక్షి ఒప్పుకుంటుందా..? 
 
6. చంద్రబాబుని, ఆయన కొడుకుని ఏపీ టూరిస్టుల కింద పిలిస్తే బాగుంటుంది. ఎందుకంటే, సొంత ఇల్లు ఇక్కడే ఉండి, గత ఆరు నెలలుగా 15 రోజులు కూడా ఈ రాష్ట్రంలో నివాసం ఉండని వ్యక్తిని టూరిస్టుగానే భావించాల్సి ఉంటుంది. చంద్రబాబు టూరిస్ట్‌లా చుట్టపుచూపులా, వలస పక్షులు వచ్చినట్లు వచ్చి పోతున్నాడు.

ముఖ్యమంత్రి జగన్‌  తీసుకున్న నిర్ణయాలు తప్పు అయితే మీరు చేస్తున్న పోరాటాలు చారిత్రక ఆవశ్యకత అయి విజయం సాధిస్తే టీడీపీకి మంచి మైలేజి వచ్చేది, మీ కుమారుడు కూడా హీరోలాగా ఉండేవాడు కదా, మరి ఈ అవకాశం ఎందుకు ఉపయోగించుకోలేదు..
 
7. అమరావతిలో బాబు, ఆయన  కొడుకు నడుపుతున్న డ్రామ చూస్తున్న ప్రజలకు మౌలికంగా మరో సందేహం కూడా కలుగుతోంది. సోషల్ మీడియాలో జడ్జిలపై చేసిన వ్యాఖ్యల మీద సీబీఐ ఎంక్వైరీకి అప్పగించాలా అని హైకోర్టు జడ్జి అడిగినప్పుడు మా అడ్వకేట్ జనరల్ ధైర్యంగా అందుకు మాకు ఎటువంటి అభ్యంతరం లేదని సీబీఐ విచారణకు ఇవ్వండని సమాధానం చెప్పారు. 

- ఇటీవలకాలంలో బహుశా దేశ చరిత్రలోనే ఏ హైకోర్టులోనూ, చివరికి సుప్రీంకోర్టులో కూడా ఇవ్వనన్ని అంశాల మీద మన హైకోర్టు ద్వారా సీబీఐ విచారణలకు ఆదేశించడం, నిరభ్యంతరంగా సీబీఐకి ఇవ్వండని రాష్ట్ర ప్రభుత్వమే ముందుకు రావడం రాష్ట్ర ప్రజలు చూశారు. 

-జగన్ మోహన్ రెడ్డికి ఈ ధైర్యం ఎక్కడిది అంటే మేం ఎక్కడా తప్పుచేయట్లేదు, ఆధారం లేనిదే ఒక్క మాట కూడా మాట్లాడడం లేదు. ఇది పూర్తిగా ప్రజల ప్రభుత్వం, పారదర్శకంగా, నిజాయితీగా పనిచేస్తున్నందువల్లే ఒక స్పష్టతతో ఏదైనా నిర్ణయం తీసుకోగలుగుతున్నాం.
 
8. ఎకరం, రెండు ఎకరాల రైతులు నిగ్రహంగానే ఉన్నారు. చిన్న పొలాలు ఉన్న రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని చంద్రబాబు చెబుతున్నది అబద్ధం. ఒకవేళ అదే నిజమనుకుంటే, మరి 2 వేల ఎకరాలకు పైగా ఉన్న బినామీ భూములు కొనుక్కున్న చంద్రబాబు- ఎందుకంత గుండె నిబ్బరంతో ఉండగలిగాడు.. ?

-అమరావతిలో అమరులు అంటూ తండ్రీకొడుకులు పదేపదే ట్వీట్‌లు పెడుతున్నారు, మొన్న లాజర్ చనిపోతే.. తన తండ్రి చావును టీడీపీ, ఇతర ప్రతిపక్షాలు ఎలా రాజకీయాలకు వాడుకుంటున్నాయో ట్వీట్ ద్వారా తిడుతూ ఆయన కుమార్తె గట్టిగా బుద్ధి చెప్పినా వీళ్ళ ప్రవర్తనలో మార్పు రాలేదు.
 
9. అమరావతిలో  చంద్రబాబు హయాంలో జరిగింది పచ్చి మోసం, పచ్చి రియల్ ఎస్టేట్ వ్యాపారం. వాస్తవానికి ఇప్పుడు జగన్‌ హయాంలోనే అమరావతికి న్యాయం జరుగుతుంది, జరగబోతుంది. మీరు, మీ బినామీలు రైతుల దగ్గర భూములు కొల్లగొట్టి మీకు అవసరమైన ఒక స్వర్గం నిర్మించుకోవాలనే ప్రయత్నం చేశారు.

2019లో అమరావతి రైతులు, రైతు కూలీలు, మీ సామాజికవర్గంతో సహా అందరూ మిమ్మల్ని ఛీ కొట్టారు, కాబట్టే ఇక్కడ కూడా వైఎస్‌ఆర్‌సీపీ గెలిచింది. కారణం లేకుండా ఉద్యమాలు ఎప్పుడూ రావు, మీ అంతట మీరు అనుకుని కృత్రిమ ఉద్యమం చేయాలనుకుంటే కాదు, చంద్రబాబుకు అసలు ఉద్యమం అనేదే తెలీదు, విధ్వంసం మాత్రమే ఆయనకు తెలుసు, మోసం తెలుసు, నిర్మాణం తెలీదు, నిజాయితీ లేదు. 
 
10. అమరావతిపై మీరు ఎన్ని రోజులైనా ఇలానే కెమెరాలను పెట్టుకుని పోరాడండి, 300 రోజులు కాదు.. 1200 రోజులైనా ఇలానే పోరాడండి.. వచ్చే ఎన్నికల్లో ప్రజలు నిర్ణయిస్తారు, మీది కెమెరాల ఉద్యమమా.. లేక నిజమైన ఉద్యమమా అన్నది. 

-మూడు ప్రాంతాలలో సమగ్ర అభివృద్ధిని వ్యతిరేకించేవారిగా, మీకు మూడు ప్రాంతాల్లో నూకలు చెల్లిపోయాయి. అందుకే ఈ డ్రామాలు. 

-అమరావతిలో రాజధాని ఉంటుంది. విశాఖ, కర్నూలు కూడా రాజధానులు కాబోతున్నాయి. చంద్రబాబు చేస్తున్న ఉద్యమం అమరావతి రాజధాని కావాలని కాదు. విశాఖ, కర్నూలు రాజధాని కాకూడదని ఉద్యమం చేస్తున్నాడు. అంటే ఉత్తరాంధ్ర ఆత్మ గౌరవం మీద, రాయలసీమ ఆత్మగౌరవం మీద తన బినామీ భూముల రేట్ల కోసం, ఒక టీవీ కెమెరా ఉద్యమాన్ని నడుపుతున్నాడు. 
 
14. రాష్ట్రంలో అన్ని ప్రాంతాల సమగ్ర అభివృద్దిలో భాగంగా అమరావతి కూడా అభివృద్ది జరుగుతుంది, దీనిపై ప్రతిపక్షాలు రేకెత్తిస్తున్న ఎలాంటి అపోహాలను నమ్మవద్దు. పది మంది స్వార్ధం వల్లనో లేక కోర్టులలో అడ్డుతగలడం వల్లనో మరింత ఆలస్యం అవుతుంది. అధికారంలో ఉండి అమరావతిని పట్టించుకోని చంద్రబాబు ఇప్పుడు ప్రతిపక్షంలో ఉండి కూడా ఈ ప్రాంత అభివృద్దికి అడ్డుతగులుతున్నారనే విషయాన్ని ఈ ప్రాంత ప్రజలు కూడా గుర్తించాలి.

- కోవిడ్ అంటే భయపడే బాబు, అతని కొడుకు రాజకీయాల్లో ఉండటం కన్నా, తలుపులు వేసుకుని ఇంట్లోనే ఉంటూ జూమ్ మీటింగ్ లో మాట్లాడుకుంటూ ప్రజల పార్టీ అని కాకుండా, ఇంటర్నెట్ పార్టీని, లేక సైబర్ పార్టీని నడుపుకుంటే మంచిది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు