కోటరీని పక్కనపెట్టకపోతే జగన్‌కు భవిష్యత్ లేదు ... విరిగిన మనసు మళ్లీ అతుక్కోదు : విజయసాయి రెడ్డి (Video)

ఠాగూర్

బుధవారం, 12 మార్చి 2025 (16:07 IST)
వైకాపా అధినేత, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ఆ పార్టీ మాజీ నేత విజయసాయిరెడ్డి కీలక సూచనలు చేశారు. జగన్ సర్.. కోటరీని పక్కన పెట్టకపోతే వైకాపాతో పాటు మీకు కూడా భవిష్యత్ ఉండదని చెప్పారు. నిజాలు తెలుసుకోండి అని సూచించారు. పైగా, తాను మళ్లీ వైకాపాలో చేరబోనని స్పష్టం చేశారు. విరిగిన మనసు మళ్లీ అతుక్కోదని ఆయన అన్నారు. 
 
కాకినాడ పోర్టు వాటాలను బలవంతంగా బదిలీ చేయించుకున్నారన్న కేసులో విజయసాయి రెడ్డి నిందితుడుగా ఉన్నారు. ఈ కేసులో ఆయనకు సీఐడీ నోటీసులు జారీ చేయడంతో బుధవారం విచారణకు హాజరయ్యారు. ఆ తర్వాత ఆయన మీడియాతో మట్లాడుతూ, పార్టీలో ఎదగడానికి కొందరు తనను కిందకు లాగారన్నారు. జగన్ చుట్టూత ఉన్న కోటరీ కారణంగా ఆయనకు తీవ్ర నష్టం జరుగుతోందన్నారు. కోటరీ నుంచి జగన్ బయటకు రాకపోతే జగన్‌కు రాజకీయ భవిష్యత్ ఉండదన్నారు. 
 
తన మనసులో మాత్రం జగన్‌కు సుస్థిర స్థానం ఉందని, కానీ జగన్ మనసులో తనకు స్థానం లేదన్నారు. అందుకే తాను పార్టీ నుంచి బయటకు వచ్చేసినట్టు చెప్పారు. కోటరీ వల్లే తాను జగన్‌కు దూరమైనట్టు చెప్పారు. కోటరీ మాటలు వినొద్దని జగన్‌కు స్పష్టంగా చెప్పానని తెలిపారు. భవిష్యత్‌లో ఏ పార్టీలో చేరే ప్రసక్తే లేదన్నారు. విరిగిన మనుసు మళ్లీ అతుక్కోదన్నారు. ఏ పార్టీలో చేరాలనేదానిపై తాను ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని చెప్పారు. 
 
"సార్... మీ మనసులో నాకు స్థానం లేదు. మీ మనసులో స్థానం లేనపుడు నేను పార్టీలో ఉండలేను. ఎవరు నిజాలు చెబుతున్నారో.. ఎవరు అబద్ధాలు చెబుతున్నారో అర్థం చేసుకోండి. కోటరీ నుంచి బయటపడండి'' అని జగన్‌ తనతో మాట్లాడినపుడు స్పష్టంగా చెప్పానని విజయసాయి వెల్లడించారు. 
 
నాయకుడు అనేవాడు చెప్పుడు మాటలు వినరాదన్నారు. చెప్పుడు మాటలు వింటే ఆ నాయకుడే కాదు.. ప్రజలు, పార్టీ కూడా నష్టపోకతప్పదని చెప్పారు. తనకు, జగన్‌కు మధ్య కొందరు విభేదాలు సృష్టించారని తెలిపారు. కోటరీకి అనుకూలంగా ఉంటేనే జగన్ వద్దకు తీసుకెళతారని అన్నారు. జగన్ వద్దకు ఎవరినైనా తీసుకెళ్లాలంటే కోటరికీ లాభం చేకూర్చాల్సి ఉంటుందని విజయసాయి రెడ్డి ఆరోపించారు. 
 

పార్టీ నుంచి నేను బయటికి వచ్చాక కూడా జగన్ బాగుండాలనే కోరుకుంటున్నాను.
జగన్ ఆయన చుట్టూ ఉన్న కోటరీ నుంచి ఎప్పుడైతే బయటికి వస్తారో అప్పుడే ఆయనకు భవిష్యత్తు ఉంటుంది
లేకపోతే జగన్ భవిష్యత్తు కష్టంగా ఉంటుంది
- విజయసాయి రెడ్డి pic.twitter.com/PKOS4ple2j

— ChotaNews App (@ChotaNewsApp) March 12, 2025

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు