తనపై జరిగిన దాడి గురించి చంద్రబాబుకు పట్టాభి వివరించి చెప్పారు. ఆ సమయంలో పట్టాభి మంచంపైనే పడుకుని ఉన్నారు. పట్టాభి ఇంటికి దేవినేని ఉమా మహేశ్వరరావు, బోండా ఉమా మహేశ్వరరావుతో పాటు పలువురు టీడీపీ నేతలు, కార్యకర్తలు కూడా భారీగా చేరుకుంటున్నారు.
కాగా, తనపై జరిగిన దాడి గురించి పట్టాభి మాట్లాడుతూ, సుమారుగా 15 మంది వచ్చి తనపై, తన వాహనంపై దాడి చేశారని చెప్పారు. రాడ్లు, కర్రలు, బండ రాళ్లతో దాడి చేశారన్నారు. 10 రోజులుగా తనకు బెదిరింపులు వస్తున్నాయని, ప్రభుత్వ అవినీతిని బయటపెడుతున్నాననే తనపై దాడి చేశారని తెలిపారు.
తనను హత్య చేయాలనే పథకం ప్రకారం దాడి చేశారని, ఎన్ని దాడులు చేసినా తన గొంతు నొక్కలేరని స్పష్టం చేశారు. ప్రాణాలు పోతున్నా డీజీపీ పట్టించుకోరా? అని ప్రశ్నించారు. డీజీపీ వచ్చి న్యాయం చేస్తామని తనకు హామీ ఇవ్వాలని పట్టాభి డిమాండ్ చేశారు.