అసలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏం జరుగుతోంది? సీజేఐ కీలక వ్యాఖ్యలు
శుక్రవారం, 24 జులై 2020 (14:34 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవహారంలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి బోబ్డే కీలక వ్యాఖ్యలు చేశారు. అసలు ఏపీలో ఏం జరుగుతోందంటూ ప్రశ్నించారు. ఏపీ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వుల మేరకు రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రధానాధికారిగా నిమ్మగడ్డ రమేశ్ కుమార్‌ను కొనసాగించాలంటూ వైసీపీ ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది.
ఈ పిటిషన్ విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ బోబ్డే కీలక వ్యాఖ్యలు చేశారు. నిమ్మగడ్డ కేసు విషయంలో ప్రతి విషయం తమకు తెలుసని ప్రధాన న్యాయమూర్తి వ్యాఖ్యానించారు. నిమ్మగడ్డ విషయంలో హైకోర్టు తీర్పుపై స్టే ఇవ్వాల్సిన అవసరం తమకు కనిపించడం లేదని... అందుకే స్టే ఇవ్వడం లేదని తేల్చి చెప్పారు.
నిమ్మగడ్డకు పోస్టింగ్ ఇవ్వాలంటూ గవర్నర్ లేఖ పంపినా పాటించకపోవడం దారుణమని అసహనం వ్యక్తం చేశారు. గవర్నర్ ఆదేశాలను ఎందుకు అమలు చేయలేదని ప్రశ్నించారు. గవర్నర్ ఆదేశించేంత వరకు పరిస్థితి ఎందుకు వచ్చిందని ప్రభుత్వ తరపు న్యాయవాదిని సీజేఐ నిలదీశారు.
అసలు రాష్ట్రంలో ఏం జరుగుతోందంటూ ఆయన ప్రశ్నించడం గమనార్హం. వచ్చే శుక్రవారంలోపు హైకోర్టు ఆదేశాలను అమలు చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది.
కాగా, ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ అంశంలో కోర్టు ధిక్కరణ ప్రొసీడింగ్స్‌పై స్టే ఇవ్వాలంటూ ఏపీ ప్రభుత్వం వేసిన పిటిషన్‌పై శుక్రవారం సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. దీనిని సుప్రీం చీఫ్ జస్టిస్ బోబ్డే నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం విచారించింది. ఈ సందర్భంగా నిమ్మగడ్డ రమేశ్ తరపున కోర్టులో ప్రముఖ లాయర్ హరీశ్ సాల్వే వాదనలు వినిపించారు.
కోర్టులు ఇచ్చిన తీర్పులను ఏపీ ప్రభుత్వం అమలు చేయడం లేదని ఈ సందర్భంగా సుప్రీంకోర్టుకు హరీశ్ సాల్వే తెలిపారు. రాష్ట్ర హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వచ్చిందని... అందువల్ల స్టే ఇవ్వాల్సిన అవసరం లేదని చెప్పారు.
హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై వైసీపీ నేతలు మీడియాలో, సామాజిక మాధ్యమాల్లో ఇష్టం వచ్చినట్టు కామెంట్లు కూడా చేశారని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. కోర్టులు, జడ్జిలు, జడ్జిమెంట్లకు వ్యతిరేకంగా మాట్లాడిన క్లిప్పింగ్స్‌ను తమకు అందజేయాలని ఈ సందర్భంగా సుప్రీంకోర్టు కోరింది.
నిమ్మగడ్డ విషయంలో ప్రతి అంశం తమకు తెలుసని... అందుకే కావాలనే ఈ కేసులో స్టే ఇవ్వడం లేదని కీలక వ్యాఖ్యలు చేసింది. గవర్నర్ లేఖను కూడా పట్టించుకోకపోవడం దారుణమని చీఫ్ జస్టిస్ వ్యాఖ్యానించారు.