డ్రగ్ మాఫియాపై ఎపికి సంబంధం లేకపోతే ఎన్ఐఎ టీమ్ ఎందుకు వచ్చింది?: ధూళిపాళ్ల నరేంద్ర

బుధవారం, 13 అక్టోబరు 2021 (08:47 IST)
హెరాయిన్ కేసులో  రాష్ట్రానికి సంబంధం లేదని బ్లూ మీడియా తప్పుదారి పట్టిస్తోందని మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్రకుమార్  అన్నారు. ఎన్ఐఎ తాజాగా విడుదల చేసిన పత్రికా ప్రకటనలో టాల్కమ్ పౌడర్ పేరుతో దిగుమతి అయిన హెరాయిన్‌కు సంబంధించి విజయవాడతోపాటు చెన్నయ్, కోయంబత్తూరు, ఢిల్లీ తదితర ప్రాంతాల్లో పెద్దఎత్తున సోదాలు నిర్వహించి డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపిందని ఆయన గుర్తు చేశారు.

డ్రగ్స్ కేసుపై డీఆర్ఐ విచారణ జరుపుతున్న సమయంలో రాష్ట్రానికి సంబంధం లేదని డీజీపీ ఎలా క్లీన్ చిట్ ఇచ్చారని ధూలిపాళ్ల ప్రశ్నించారు. ఆషీ ట్రేడింగ్ కంపెనీతో గత ఏడాది కాలంగా కార్యకలాపాలు నిర్వహించినట్లు ఆ సంస్థ పేరుతో సమర్పించిన జీఎస్టీ రిటర్న్స్ సమర్పించిన మాట వాస్తవం కాదా? అని ఆయన నిలదీశారు.

"విజయవాడ ఆషీ ట్రేడింగ్ కంపెనీ పేరుతో ఆఫ్ఘనిస్థాన్ కాందహార్ లో గల హసన్ హుసేన్ సంస్థ  నుంచి దిగుమతి అయిన 21వేల కోట్లరూపాయల హెరాయిన్ కు సంబంధించిన కేసులో ఎన్ఐఎ దర్యాప్తు ముమ్మరం చేసిన నేపథ్యంలో జగన్ రెడ్డి ప్రభుత్వం తమ బ్లూమీడియా ద్వారా ఆ డ్రగ్స్ తో రాష్ట్రానికి సంబంధం లేదని ప్రజలను తప్పుదారి పట్టిస్తూ సెల్ఫ్ సర్టిఫికేట్ ఇచ్చేసుకుంటున్నారు.

ఈ విషయంలో పత్రికల్లో వచ్చిన 24గంటల తర్వాత రాష్ట్ర డిజిపి, విజయవాడ పోలీస్ కమిషనర్ ఎటువంటి విచారణ జరపకుండా సంబంధిత సరుకుతో విజయవాడకు సంబంధం లేదని, కేవలం లైసెన్సు మాత్రమే వాడుకున్నారని ఏవిధంగా క్లీన్ చిట్ ఇస్తారు?  గత నెల 13వతేదీన గుజరాత్ లోని ముంద్రా పోర్టులో ఆషీ ట్రేడింగ్ కంపెనీ పేరుతో వచ్చిన రెండు కంటైనర్లలో 21వేల కోట్లరూపాయల విలువైన 3టన్నుల హెరాయిన్ పట్టుబడింది.

అయితే ఆషీ ట్రేడింగ్ కంపెనీతో గత ఏడాది కాలంలో కార్యకలాపాలు నిర్వహించినట్లు ఆ సంస్థ పేరుతో సమర్పించిన జిఎస్ టి రిటర్న్స్ సమర్పించిన మాట వాస్తవం కాదా?  జూన్ లో ఇదే కంపెనీ పేరుతో 1.75లక్షల కోట్ల విలువైన హెరాయిన్ దిగుమతి అయినట్లు నిఘా సంస్థలు గుర్తించాయి. వీటన్నింటిపై ప్రస్తుతం నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజన్సీ దర్యాప్తు జరుపుతోంది.

దేశ సార్వభౌమత్వానికి భంగం కలిగించే విధంగా వ్యవహరించిన డ్రగ్ మాఫియాలో ఉన్నవారు ఎవరైనా కఠిన శిక్షలు ఎదుర్కోక తప్పదు. ఎన్ఐఎ తాజగా విడుదల చేసిన పత్రికాప్రకటనలో టాల్కమ్ పౌడర్ పేరుతో దిగుమతి అయిన హెరాయిన్ కు సంబంధించి విజయవాడతోపాటు చెన్నయ్, కోయంబత్తూరు, డిల్లీ తదితర ప్రాంతాల్లో పెద్దఎత్తున సోదాలు నిర్వహించామని, ఈ తనిఖీల్లో పలు కీలకపత్రాలు, వస్తువులను స్వాధీనం చేసుకున్నామని, విచారణ కొనసాగుతోందని తెలిపింది.

వాస్తవాలను మరుగునపర్చి రాష్ట్రానికి సంబంధం లేదని కేంద్ర హోంశాఖ, ఎన్ఐఎ క్లీన్ చిట్ ఇచ్చిందని గోబెల్స్ ప్రచారం చేసుకోవడంవల్ల తాత్కాలికంగా వారు సంతృప్తి చెందవచ్చు కానీ నిజానిజాలు త్వరలోనే బయటకు వస్తాయి. నిజానిజాలు వెలికితీసి డ్రగ్ మాఫియాలో ఉన్న పెద్దతలకాయలు ఎంతటివారైనా బయటకు తీసి వారి నిజస్వరూపాన్ని దేశప్రజలకు వెల్లడించాల్సిందిగా ఎన్ఐఎ కు తెలుగుదేశం పార్టీ విజ్జప్తి చేస్తోంది" అని ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ పేర్కొన్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు