విజయసాయి రెడ్డిని కారు నుంచి బలవంతంగా దింపిన సీఎం జగన్!!

గురువారం, 7 మే 2020 (17:58 IST)
ఏపీ ముఖ్యమంత్రి, వైకాపా అధినేత వైఎస్. జగన్మోహన్ రెడ్డి కుడి భుజంగా చెప్పుకునే ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి ఖంగుతిన్నారు. ఈయనను సీఎం జగన్ బలవంతంగా తన కారు నుంచి దించేశారు. ఈ చర్య విజయసాయిరెడ్డికి ఓ షాక్‌లా అనిపించింది. ఈ దృశ్యం తాడేపల్లిలోని సీఎం నివాసంలో జరిగింది. ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
వైజాగ్‌లోని ఎల్జీ పాలిమర్స్ కెమికల్ ప్లాంట్‌లో గురువారం వేకువజామున విష వాయువు లీకైంది. దీంతో ఆ కంపెనీ చుట్టుపక్కల వుండే ప్రజలు తీవ్ర అస్వస్థతకు లోనయ్యారు. పైగా, గ్యాస్ లీకైన ఘటనలో 11 మంది వరకు ప్రాణాలు కోల్పోగా, మరికొందరు తీవ్ర అస్వస్థతకు లోనై వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.
 
ఈ విషయం తెలుసుకున్న వెంటనే క్షతగాత్రులను పరామర్శించేందుకు ప్రత్యేక విమానంలో విజయవాడ నుంచి విశాఖపట్టణంకు ఆయన బయలుదేరాలని నిర్ణయించుకున్నారు. ఆ ప్రకారంగానే తాడేపల్లిలోని తన అధికారిక నివాసం నుంచి బయల్దేరేటప్పుడు ఓ ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. ఇది రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.
 
విమానాశ్రయానికి బయల్దేరేందుకు జగన్ కారెక్కారు. ముందు సీటులో జగన్ కూర్చున్న వెంటనే... వెనక సీటులో రాజ్యసభ సభ్యుడైన తన కుడిభుజంగా భావించే విజయసాయి రెడ్డి కూడా ఎక్కి కూర్చొన్నారు. అయితే క్షణాల వ్యవధిలోనే కారు నుంచి విజయసాయి దిగిపోయారు. విజయసాయి రెడ్డి స్థానంలో ఆరోగ్య మంత్రి ఆళ్లనాని వాహనంలోకి ఎక్కారు. వెంటనే వాహనం అక్కడి నుంచి బయల్దేరింది.
 
విజయసాయి రెడ్డి మాత్రం అక్కడే ఉండిపోవడంతో సీఎం జగన్ వెంట విజాగ్‌కు చేరుకోలేక పోయారు. అయితే, ఇపుడు విజయసాయిని జగన్ కారు నుంచి ఎందుకు దించేశారన్న అంశం సర్వత్రా ఆసక్తిని రేకెత్తిస్తోంది. నిజానికి విశాఖపట్టణంలో పార్టీ వ్యవహారాలన్నీ విజయసాయి రెడ్డే చక్కబెడుతున్నారు. పర్యవేక్షిస్తున్నారు. 
 
ఈ నేపథ్యంలో వైజాగ్‌కు జగన్‌తో పాటు వెళ్లేందుకు ఆయన కూడా కారెక్కారు. అయితే, ఆ వెంటనే విజయసాయి కిందకు దిగిపోవడం... మంత్రి ఆళ్ల నాని కారులోకి ఎక్కడం జరిగింది. ఈ వ్యవహారం ప్రజల ఆరోగ్యానికి సంబంధించినది కావడంతో... తనతో పాటు ఆరోగ్యమంత్రిని జగన్ తీసుకెళ్లారని తెలుస్తోంది.
 
అయితే, విపక్షాలు, నెటిజన్లు మాత్రం మరోలా స్పందిస్తున్నారు. బీజేపీ రాజ్యసభ సభ్యుడుగా ఉన్న సుజనా చౌదరికి ఒకపుడు విజయసాయిరెడ్డి ఆడిటర్‌గా వ్యవహరించారు. అయితే, ఇటీవల ఓ కార్యక్రమంలో విజయసాయి రెడ్డి మాట్లాడుతూ.. సుజనా చౌదరి గుట్టంతా తన చేతుల్లో ఉందని బహిరంగంగా వ్యాఖ్యానించారు. 
 
అంటే.. ఇపుడు జగన్మోహన్ రెడ్డి గుట్టు కూడా తన చేతుల్లోనే వుందన్న అర్థంలో విజయసాయి చెప్పకనే చెప్పారనీ, అందుకే జగన్‌కు మండిపోయి.. మెల్లగా పక్కనబెడుతున్నారన్న ప్రచారంసాగుతోంది. ఏది ఏమైనా తనను కారు నుంచి దించేయడాన్ని మాత్రం విజయసాయి రెడ్డి ఏమాత్రం జీర్ణించుకోలేరన్నది వాస్తవం. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు