పల్నాడు జిల్లా నరసరావుపేటలో రూ.50 వేల అప్పు ఇద్దరి ప్రాణాలు తీసింది. మరో ఇద్దరు ప్రాణాపాయస్థితిలో ఉన్నారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, సత్తెనపల్లి మండలం, ఫణిదం గ్రామానికి చెందిన శ్రీనివాసరావు అదే గ్రామానికి చెందిన దాసరి వెంకటేశ్వర్లు ఆరు నెలల క్రితం రూ.50 వేలు అప్పుగా ఇచ్చాడు. అప్పు చెల్లించాలని కొన్ని రోజులుగా కోరుతున్నా వెంకటేశ్వర్లు ముఖం చాటేస్తున్నాడు.
ఈ క్రమంలో మంగళవారం వెంకటేశ్వర్లు ఇంటి వద్దకు శ్రీనివాసరావు భార్య పూర్ణకుమారి, కుమారుడు వెంకటేశ్ వెళ్లి అప్పు చెల్లించాలని నిలదీశారు. అప్పు చెల్లించలేనంటూ వెంకటేశ్వర్లు పురుగుల మందు తాగాడు. దీంతో పూర్ణకుమారి ఇంటికి వచ్చి జరిగిన విషయాన్ని భర్త శ్రీనివాసరావుకు చెప్పింది. వెంకటేశ్వర్లు ప్రాణాలకు ముప్పు ఉంటుందేమోనన్న భయంతో శ్రీనివాసరావు కుటుంబం మానసిక ఒత్తిడికి గురైంది.
గుంటూరులోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో ప్రాణాపాయస్థితిలో ఉన్నాడని తెలుసుకుని శ్రీనివాసరావు కూడా పరుగుల మందు తాగాడు. ఈ పరిమాణాన్ని ఊహించని ఆయన భార్య పూర్ణకుమారి, కుమారుడు వెంకటేశ్ కూడా బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్నారు. పూర్ణకుమారి మృతదేహం లభించగా, కుమారుడు మృతదేహం కోసం గాలిస్తున్నారు. ప్రస్తుతం శ్రీనివాస రావు, వెంకటేశ్వర్లు మాత్రం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. సత్తెనపల్లి గ్రామీణ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.