వచ్చే ఎన్నికల్లో చాలా మందికి టిక్కెట్లు ఇవ్వనని ఏపీ ముఖ్యమంత్రి, వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి స్పష్టం చేశారు. వైకాపా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నియోజకవర్గాల బాధ్యులు, ప్రాంతీయ సమన్వయకర్తలు, జిల్లా అధ్యక్షులతో మంగళవారం క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన విస్తృతస్థాయి సమావేశంలో సీఎం ఈ వ్యాఖ్యలు చేశారు.
ఇందులో సీఎం జగన్ మాట్లాడుతూ, 'నియోజకవర్గాల్లో సర్వేలు చివరికొచ్చాయి. వచ్చే రెండు నెలలు మీకు కీలకం. మీలో చాలామందికి మళ్లీ టికెట్లు రావొచ్చు.. కొందరికి టికెట్లు ఇవ్వలేకపోవచ్చు. ప్రజల్లో మీరుంటున్న తీరు, మీకున్న ఆదరణ వంటివాటిని బేరీజు వేసుకుని.. ఎన్నికల్లో తప్పులు చేయకూడదని తీసుకునే నిర్ణయాలకు సహకరించాలి. టికెట్ వచ్చినా రాకపోయినా మీరు నా మనుషులే. 175కి 175 స్థానాలు సాధ్యమే. క్షేత్రస్థాయిలో మనకు సానుకూల సంకేతాలు ఉన్నాయి. కాబట్టే ప్రతిపక్షాలు ఒంటరిగా రావడానికి భయపడి పొత్తుల కోసం వెతుక్కుంటున్నాయి. ఇదే ఆత్మవిశ్వాసం, ఇదే ధైర్యం, ఇదే ముందు చూపు, ప్రణాళికతో అడుగులు వేయాలి. మండల, గ్రామ స్థాయిలో నాయకులతో విభేదాలను వెంటనే పరిష్కరించుకోండి' అని సూచించారు.
'ఎందుకు ఆంధ్రాకి జగనే కావాలి' అనే కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లడంపై వైకాపా మండలస్థాయి నాయకులు, ప్రజాప్రతినిధులకు అక్టోబరు 9న, ఎమ్మెల్యేలు, నియోజకవర్గాల బాధ్యులకు 8న శిక్షణ ఉంటుంది. సచివాలయ స్థాయిలో పార్టీ కేడర్ అంతా ఇంటింటికీ వెళ్లి జనాన్ని కలిసి మాట్లాడతారు. జగనన్న ఆరోగ్య సురక్షను ఈ నెల 29న ముఖ్యమంత్రి ప్రారంభిస్తారు. 30 నుంచి అన్ని నియోజకవర్గాల్లో ఈ కార్యక్రమాన్ని ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో చేపట్టాలని సీఎం ఆదేశించారు.
ఇదిలావుంటే, తన వద్ద డ్రైవర్‌గు పని చేసిన దళిత యువకుడిని హత్య చేసి డోర్ డెలివరీ చేసిన కేసులో నిందితుడిగా జైలుకు వెళ్లి ఇప్పుడు బెయిలుపై ఉన్న ఎమ్మెల్సీ అనంతబాబు ఈ సమావేశానికి రావడం చర్చనీయాంశంగా మారింది. హత్య జరిగిన ఆరు రోజులకు అనంతబాబును వైకాపా నుంచి సస్పెండ్ చేశారు. అయినా ఇప్పుడు ముఖ్యమంత్రి వద్ద సమావేశానికి ఎలా వస్తారని నేతలే చర్చించుకోవడం కనిపించింది.
సాధారణంగా సీఎంఓలోకి వెళ్లడం అంత సులభం కాదు. అనంతబాబు మాత్రం దర్జాగా వెళ్లి సీఎం సమావేశంలోనూ పాల్గొన్నారు. గత నెలలో ముఖ్యమంత్రి కూనవరంలో వరద ప్రాంతాల పరిశీలనకు వెళ్లినప్పుడు నిర్వహించిన సమావేశంలోనూ సీఎంతోపాటు వేదికపై అనంతబాబు ఉన్నారు. అంటే హత్య చేసి డోర్ డెలివరీ చేసిన అనంతబాబుకు ముఖ్యమంత్రి అండదండలు పుష్కలంగా ఉన్నట్టుగా వైకాపా నేతలు అభిప్రాయపడుతున్నారు.